పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

525


చెప్పఁగలమా? యీశంకలకు సరియైన సమాధానాలు కనపడవు. మొత్తం నన్నయ్యగారిక్కూడా యేదో ఆధారం వుండితీరాలన్నది సిద్ధాంతం. శాసనాలకవిత్వం మాత్రమే నన్నయ్యగారికి పూర్వం వుండేదంటూ కొందఱువ్రాస్తారు. ఆశాసనాల్లోకూడా యీ మాటలు వున్నట్టులేదు. నిఘంటులన్నీ నన్నయ్యగారి కీవలివేను. నన్నయ్యగారు వాడని పదాలు కొన్ని- ఉపతాయి మొదలైనవి స్వల్పంగా తిక్కన్నగారు వాడివున్నారు. అవి వ్యావహారికాలో, గ్రాంథికాలో తెలియదు. భాష ప్రపంచ సృష్టితోపాటు అనాదిగా వుండితీరుతుందన్నదే తుదకు సర్వసమ్మతమైన మాట. భవతు. దీన్ని యీలావుంచి ప్రసక్తి కలిగింది కనక యెఱ్ఱన్న గారిని గూర్చి కూడా కొన్ని మాటలు వ్రాస్తాను. ఈయన వ్రాసిన భారతారణ్యపర్వశేషంకూడా ముద్దులుమూట కడుతూ జనరంజకంగానే వుంది. కనకనే మళ్లా యెవరున్నూ కలిగించుకొని పునఃపాకాని కుపక్రమించలేదు. యావత్తుకూ వుపక్రమించినవారు పలువురున్నూ ఆ పాకాన్ని అతిక్రమించినట్టున్నూ లేదు.

చ. ధనములు చాల గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్
    మనమున నెన్నఁడున్ సుకృతమార్గము పొంతనుబోక లోభమో
    హనిరతబద్దులై తిరుగునట్టి జనుల్ పరలోక సౌఖ్యమున్
    గనుటకు నేర రిప్పటి సుఖంబులు మేలయి తోcచు వారికిన్.

క. ఈలోకమ యగుఁగొందఱ
    కాలోకమ కొందఱకు నిహంబును బరమున్
    మేలగుఁ గొందఱ కధిపా!
    యే లోకము లేదు సూవె యిలఁ గొందఱకున్.

యీలాటి వింకా యెన్నో పద్యాలు వుదాహరించతగ్గవి వున్నాయి. సమాసగ్రథన విషయంలో మొట్టమొదటనే నన్నయగారి "శారద రాత్రుల” పద్యాన్ని యీయన అనుకరించవలసిన ఆవశ్యకత కలిగింది. అనుకరించి “స్ఫురదరుణాంశురాగరుచి" మొదలైన పద్యాలను ఇంచుమించు అదేశైలితో ముగించి చాలవఱకు కృతార్థుఁడుకూడ కాఁగలిగాఁడు. వొక్కొక్కరి కవిత్వమందున్నూ వొక్కొక్కరి గానమందున్నూ ఒక్కొక్క విశిష్ట గుణం సహజంగా వుంటూవుంటుంది. ఆగుణం అనుకర్తలకు యే కొంత భాగమో స్వాధీన మవుతుంది గాని, పూర్తిగా స్వాధీనం కాదన్నది సర్వానుభవసిద్ధం. శ్రీనారాయణ దాసుగారిని హరికథకు లెందఱు అనుకరించడంలేదు? కోడి రామమూర్తిగారిని మల్లవిద్యాప్రవిష్ఠు లెందఱు అనుకరించడం లేదు? వొకరైనా వారి వారి పూర్తి విశేషాలు ప్రకటింపఁ గలుగుతున్నారా? పై విషయమున్నూ అలాటిదే. నిజంగా అనుకర్తలు కృతార్థులు కాఁగలిగినా