పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

520

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యేదో మా గ్రామంలో చిన్న సభచేసి యేవో అభినందనపద్యాలుకొన్ని చెప్పి యిప్పటికి నావద్ద నిల్వవున్న సేలుజోళ్లలో వత్తమతరగతి సేలుజోడును బహుమతిగా యిచ్చి నోటితో లేదనడం కంటే చేతితో లేదన్నాఁడన్న లోకోక్తికి లక్ష్యంగా వుందామని తోఁచిందని త్రికరణశుద్ధిగా యిందుమూలంగా వారికి నేను ఆహ్వానం పంపుతున్నాను. నాప్రార్థనను అచిరకాలంలోనే దయచేసి వారు సఫలీకరిస్తారని నమ్ముచున్నాను. వారు లేశమున్నూ సందేహించవలసిన విషయం యిందులో లేదు-

"కబ్బమిచ్చినవానిఁ గన్నె నిచ్చినవాని" అనే వేణుగోపాలశతకచరణాన్ని వినేవుంటారాయన. అంతేనేకాని ఆయన నాశంకలకు తగిన జవాబు వ్రాయవలసిందని సవాలుచేసివున్నప్పటికీ ఆపనికి పూనుకొనేది లేదు. పూనుకుంటే మళ్లా తిట్టవలసి వస్తుందాయె. తిట్లకు తిట్లేజవాబు. విషస్య విషమౌషధం. ఆ పని నాకేకాదు యెవరికీ యిష్టంవుండదుకదా. ఆయన యేవో తిట్లు వ్రాసివ్రాసి తుట్టతుదకు నాకు వుపదేశంగా వకపద్యాన్ని వ్రాసివున్నారు. దాన్ని వుదాహరించి యీ అవాంతర విషయాన్ని వదలి ప్రధానాంశంయెత్తుకొని నాల్గు మాటలు వ్రాసి వ్యాసాన్ని ముగిస్తాను.

తే.గీ. పరువ మనియెడు చండభాస్కరుఁడు మింటఁ
       నేగి తుది నపరాంబుధి నీడఁబడియె
       జరయనెడి కాఱుచీఁకటి పొరసె నింక
       జ్ఞానదీపికఁగొని యాత్మఁ గాంచుమయ్య

యీ పద్యంకూడా సదుద్దేశంతో వ్రాసిందికాదు గాని మనం సదుద్దేశంకిందే భావిధ్ధాం.

"కొట్టితే కొట్టాఁడు కొత్తకోకెట్టాఁడు” అన్న మాదిరిగావున్న యీ పద్యం వ్రాసిన కవిని నేను అంతో యింతో కవినైవుండి తన్మూలాన్ని యెన్నో సమ్మానాలు పొంది వుండిన్ని శక్తివున్నంతలో సమ్మానించకుండా యేలా వుండఁగలనో చదువరులే చెప్పవలసివుంటుంది. యిందులో యేదో కపటం వుందని ఆయన ఆలోచించి రాకపోతే అదినాదురదృష్టమని విచారించడం కంటె నాకు కర్తవ్యం కనపడదు. యిది నిష్కపటమైన ఆహ్వానమని యే ప్రమాణం కోరితే ఆ ప్రమాణాన్ని చేస్తాను. ఈయన రెండేళ్ల నుంచి అనారోగ్యస్థితిలో వున్నట్టు మిత్రుని ద్వారా వ్రాయించి వున్నారు. యీ పుస్తకంలో కాక యేదో భారతసంశయ విచ్ఛేదమనే వీరితాలూకుపుస్తకంలో కొన్ని అపప్రయోగాలు కనపడి నేను వాట్లకు సమాధానంయీయవలసిందని వీరి మిత్రుఁడు గారి ద్వారా కబురంపితే వారితో పైసంగతినిచెప్పి మతికూడా స్థిరంగా వుండడం లేదని చెప్పినట్లునాకు వ్రాశారు. యిందుకు నేను మిక్కిలిగా విచారిస్తూ ఉపాస్యదేవతను వీరికి త్వరలో నాతోపాటు ఆరోగ్యాన్ని కలిగించి