పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

518

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అందులో సప్రమాణంగా మేము వ్రాసిన విషయమంతా కాకపోయినా యే కొంచెమో యెత్తుకొని ఖండిస్తూ వచ్చారు. ఆ ఖండన యేలా వుంటుందంటే “నన్నయ భట్టాది కవిజనంబులుమాకున్” అనే వాక్యంలో మేము వ్రాసిన నన్నయభట్టాది. అనే అక్షరాలకు చేసిన ఖండన మేలా వుంటుందో అచ్చంగా మూఁడుమూర్తులా ఆలాగే ఉంటుందని వేఱేచెప్పనక్కఱలే దనుకుంటాను. విమర్శకుఁడుగారి పరిశ్రమకు ముఖ్య ఫలితం యేమిటంటే, మేము కొప్పరపు కవుల కవిత్వ పాండిత్యాలకు జంకి పాఱిపోయి ఆపరాభవాన్ని కప్పిపుచ్చడానికి యేమీ వుపాయంతోcచక గుంటూరుసీమ అనే అబద్ధపుతడకను అల్లి లేని జయాన్ని ప్రకటించుకొని సంతుష్టిపడ్డట్టు తేల్చడమే. యీలా తేల్చడంలో కొన్నిచోట్ల జడ్డిగానున్నూ కొన్ని చోట్ల లాయరుగానున్నూ కొన్ని చోట్ల సాక్షిగానున్నూ విమర్శకుఁడు గారు పనిచేసివున్నారు. యిలా మమ్మల్ని సమర్థించవలసిందని వీరిని కొప్రపువారుగాని, తత్పక్షీయులుగాని, కోరివున్నట్లు నామనస్సాక్షికి తోఁచుటలేదు, "ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః" గీరతవిషయాన్ని కూడా కొంత అందుకొని వీరు సమర్థనానికి పనిచేసివున్నారు. అదికూడా స్వయంగా చేసిందే కాని దానికి సంబంధించినవారి ప్రేరణవల్ల జరిగినట్టుతోఁచదు. దానికిఁగాని, దీనికిఁగాని, వారివారి ప్రేరణ యేమాత్రం వున్నా గ్రంథం అంత అనుచితధోరణిలో నడిచివుండదని నా నమ్మకం. గుంటూరి సీమపుట్టి యిప్పటికి మూఁడుదశాబ్దులు కావచ్చింది. అందులో అసత్యాలే వుంటే యిన్నాళ్లవఱకున్నూ మాకొప్పరపుసోదరులు వుపేక్షించేవారుకారు, “జల్లిసీమ" అనే పేరుతో గ్రంథం వ్రాస్తున్నామనో, వ్రాశామనో వారు ఆరోజులలో దేనిలోనో వ్రాసినట్లు జ్ఞాపకం. కాని ఆపుస్తకం బయటికి వచ్చినట్టు మాత్రంలేదు. యీవిమర్శన పుస్తకాన్ని చూచి సోదరులు లోలోపల చాలా లజ్జిస్తారనికూడా నా అంతరాత్మకు తోస్తుంది.

ఈ విమర్శకుఁడు గారికి మాయందు అందులో విశేషించి నాయందు వండే ఆగ్రహమే యీ వ్రాఁతకు కారణం. ఆగ్రహానికి కారణం నేను వైదికశాఖవాణ్ణిగా వుండడమే. మరొక కారణం నన్నయ్యభట్టు ప్రప్రథమ కవిగా వుండడమున్నూ అతణ్ణి నేను-

సీ. "నన్నయకవి పెట్టినాఁడుకదా తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష"

అని శ్రవణానందంలో కవిత్వభిక్షాప్రదాతనుగా పేర్కోవడం అనుకోవాలి. అయితే వచ్చినకోపమంతా వినియోగించారో లేదో యేలా తెలుస్తుంది? ఆలా వినియోగిస్తే యింకా ముదురుపాకంలో తిట్టేవారేమో! అందుచేత కొంత దిగమింగి వ్రాసినట్లే భావించాలి. దూషించకుండా వ్రాయరాదా అంటే దూషించకుండానే వ్రాసివున్నట్టే ఆయన అనుకొని వుందురు. అందుచేత ఆప్రశ్న మన మడగడం అనవసరం.