పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

515


కాక తెలుఁగుపదాలతో రచించడమే యుక్తమని తిక్కన్నగా రభిప్రాయపడివుందురనిన్నీ నన్నయ్య గారిక్కూడా ఆంద్రీకరణ విషయములో పైసందర్భం గోచరించవలసే వున్నను అప్పటిపండిత మండలి యీసడిస్తారేమోనని తత్సమపదభూయిష్ఠంగా రచించి వుందురనిన్నీ అభిప్రాయపడతాను. దీన్ని గురించి యింతమాత్రమే వ్రాస్తేచాలదు. యింకా వ్రాయాలి. వీరి కవిత్వాలలో నాకు గోచరించిన దింకొక విశేషము. యెంత సంస్కృత పద జటిలంగా నన్నయ్యగారి ధారనడిచినా ముఖ్య తాత్పర్యం మాత్రం తిక్కన్నగారి రచనకన్న సుళువుగానే కలిగిస్తుందనిన్నీ అభిప్రాయపడతాను. ఈసందర్భం విరాటోద్యోగాల వఱకే. యుద్ధపంచకంలో యీ చిక్కులేదు. తరువాత పర్వాలు శాంతివగయిరాలు ధర్మశాస్త్రం వంటివి. వాట్లలో అసలు సంస్కృతంలోనే అంతగా కవిత్వనైపుణికి అవకాశం లేనప్పుడు అనువాదకులకుమాత్రం యెక్కడనుంచి వస్తుంది? ధర్మశాస్త్రంగాని, వైద్యజ్యౌతిషములుగాని ఛందోబద్ధాలుగా రచించినా అవి కవిత్వాలనిపించుకోవని చాలాచోట్ల వ్రాసివున్నాను. కనుక యిక్కడ స్పృశించి విడిచాను. యితర విషయాలు చాలాచాలా నడిచినా ప్రధానంగా తెలుసుకోతగ్గది నన్నయ్యగారిశైలి సంస్కృతపదభూయిష్ఠమే అయినా అది సామాన్యులకు ప్రతి పదార్థం చెప్పవలసివస్తే కొంత అడ్డుతగులుతుందేమోకాని, తాత్పర్యార్ధాన్ని చేసుకోవడానికి అంతగా బాధించదనేదే. నాకుతోఁచిన విషయం యిది. దీన్నిబట్టి యేమి, వ్యాకరణాది సంబంధమైన మఱికొన్ని సందర్భాలనుబట్టి యేమి, ఆయన్నిగుఱించి, కొంత వ్రాస్తూ ప్రసక్తానుప్రసక్తంగా తిక్కన్నయెఱ్ఱన్నగార్లనుకూడా “మంగళాదేవి” అన్నభాష్యకారోక్తి ననుసరించి కొంచెం యెత్తుకున్నాను దేవీభాగవతప్పీఠికలో- గుం|| డి|| విమర్శకుఁడుగారు యీలా యెత్తుకోవడానిక్కూడా వొప్పుకున్నట్లు లేదు. చూడండి.

తే. గీ. కవుల చారిత్రములు వ్రాయఁగడఁగినావె?
        దేవిభాగవతమున నీ తెలివిఁ జూపి
        దురభిమానంబు నీలోన దొరలి కాక
        యాదికవిభేద మిం దేమియవసరంబు.

దేవీభాగవతములో ఆదికవుల రచనాభేదాన్ని గూర్చి నేను వ్రాయడంకూడా దురభిమానప్రయుక్తమేనఁట! అసలు నేను యీ ఆంధ్రదేశంలో పుట్టడానిక్కూడా విమర్శకుఁడుగారు సమ్మతించరనుకుంటాను.

(1) “ఉ. తిక్కనకున్న పేరు తెగఁద్రెంచియు నన్నయ కీయఁజాలితీ,
          వక్కట! యెంతకైనఁ దగుదైనను దిక్కనయేమి చేసె? నీ
          కెక్కువ యేమిత్రవ్వి తలకెత్తెను నన్నయ?”