పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/506

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

510

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వసుచరిత్రలలో వసుచరిత్రే అగ్రస్థానానికి వస్తుందని కొంతకాలం అనుకొనేవాణ్ణి. యిటీవల ఆ అభిప్రాయం మాఱింది. యేలా మాఱిందో వ్రాయవలసివస్తే చాలా వ్రాయాలి. కనక ప్రధానాంశాన్ని వుపక్రమిస్తాను. శాఖాభిమానాలనేవి నిన్న నేఁడు పుట్టినట్టుతోఁచదు. అనాదిగా వున్నట్టే తేలుతుంది. కాని వైద్యవిషయంలోనున్నూ కోర్టువిషయంలోనున్నూ దీన్ని పాటిస్తూన్నట్లు కనపడదు. చూడండీ; యెవరివైద్యం బాగానచ్చుతుందో, యెవరిహస్త అమృతహస్తమని పేరుపడుతుందో, వారు తమశాఖవారు కాకపోయినా వారిదగ్గిఱికే రోగులు వెడతారు. ఆలాగేకోర్టువిషయంలో ప్లీడర్ల దగ్గిఱికిన్నీ కవిత్వం కూడా శాఖాభిమానాన్నిపట్టి మెచ్చుకొనేవారు ప్రాజ్ఞులలో వుండరనే నాతలంపు. ఆలా యెవరేనా వున్నా వారి యభిప్రాయాన్ని లోకం బొత్తిగా ఆదరించదు. లోకం ఆదరించనప్పుడు మనలో మనం యేమనుకుంటే యేం లాభం? యింతవఱకు వ్రాసిన వ్రాఁతవల్ల మాకు భారతకవులలో యెవరియెడల యే యేవిషయంలోవున్న అభిప్రాయం యేలాటిదో గోచరిస్తుంది. కనక యిఁక విస్తరించేది లేదు. దేవీభాగవతపీఠికలో-

క. ఎన్ని పురాణమ్ములు తా|మన్నిటి నాంద్రీకరించి యనుకంపన్‌గా
    కున్నన్ దీనిన్ విడుతురె; నన్నయభట్టాది కవిజనంబులు మాకున్.

అని వకపద్యం వ్రాసివున్నాము. యీపద్యమే యీవ్యాసం వ్రాయడానికి తగ్గప్రసక్తి కల్పించింది. కనక దీన్ని బాగా గమనించవలెనని హెచ్చరిక. మేమాంద్రీకరించడానికి ఆరంభించేటప్పటికి యీపురాణం ఆంధ్రంలోకి యెవరూ అనువదించలేదనే తాత్పర్యంతోటే మేము ఆరంభించాం గాని, లేకపోతే ఆరంభించేవాళ్లంకాము. గ్రంథరచన పూర్తిఅయి సాపువ్రాస్తూ వుండఁగా తూర్పున త్రిపురాన తమ్మన్న దొరగారున్నూ, పడమట ములుగు పాపయారాధ్యులవారున్నూ, పూర్వమే తెలిఁగించినట్టు ఆప్తులు చెప్పఁగావిన్నాము. శ్రీదాసు శ్రీరామకవిగారు కూడా తాము ఆంద్రీకరిస్తున్నామని స్వయంగానే చెప్పినారు. ఆ చెప్పేటప్పుడు మీరాంద్రీకరిస్తున్నారని విన్నాననికూడా వారే సెలవిచ్చారు. ఆయీవిషయం ద్వితీయ ముద్రణపీఠికలో శ్రీ దాసువారి భాగవతపీఠికలో సుమారు యిప్పటికి పదహారేళ్లనాఁడు నేను వ్రాసేవున్నట్లు జ్ఞాపకం. సంగతి సందర్భాలు యీలా వుండఁగా గుంటూరు డి|| విమర్శకుఁడుగారు మా మీఁద యేలాటి అపవాదవేస్తున్నారో! చూడండి-

తే.గీ. దేవీభాగవతంబు నాంద్రీకరణము
      నందుఁ బ్రప్రథములుగఁ బేరందఁగోరి
      వ్రాసితిరె? యిట్లు దాసు శ్రీరామకవి తె
      నుంగు చేసినయది మున్నెఱింగి యుండి.