పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

506



నన్నయ్యభట్టు

ఈయన్ని గూర్చి యెప్పుడో సుమారు యిప్పటికి 45 ఏళ్లనాఁడు దేవీభాగవతప్పీఠికలో యేవో కొన్ని మాటలు వ్రాయవలసి వ్రాయడం తటస్థించింది. దాన్ని గుఱించి నేఁటివఱకున్నూ యెవరున్నూ యేమీ వ్యతిరేకంగా వ్రాసినట్టులేదు. అందులో నేను వ్రాసిందేనా మఱేమీలేదు-

“నన్నయసమున్నతుఁడై కడు లక్షణంపుఁ బ్రోవైగుది గూర్చు నేర్పుగలఁడై తగు" అని మాత్రమే. ఆయన్ని ప్రయోగవిషయంలో కవిత్రయంలో యెక్కువ నియమనిష్ఠలు కలవాఁడని కవులందఱూ అనాదిగా పొగుడుతూనే వున్నారు. అహోబల పండితుఁడు కవిత్రయంవారిలో నన్నయ్య ప్రయోగాన్ని శిరసావహిస్తాఁడు కాని తక్కిన యిద్దఱివీ తఱుచు, తోసేస్తూనే వుంటాఁడని విజ్ఞులందఱూ యెఱిఁగిన విషయమే. ఆంధ్రశబ్దచింతామణి నన్నయ్య రచించనట్టే పలువు రభిప్రాయపడతారు. నేనుకూడా యీ తెగలో వాఁడనే. నన్నయ్యప్రయోగాలు కొన్ని చింతామణి సూత్రాలకు వ్యతిరేకించినవి కనపడతాయి. దాన్నిఁబట్టి-

“తానొక కట్టుచేసి యది తప్పెను నన్నయ కొన్నిచోట్ల" అని వ్రాశాను. యిది స్థూలదృష్టినిచూస్తే నన్నయ్యకు న్యూనతాపాదకమే గాని గౌరవాపాదకం గాదుగదా? అయితే సామాన్యులదృష్టిలో తప్ప విజ్ఞుల దృష్టిలో యీలాటి సందర్భాలు న్యూనతాపాదకాలు కావు. యెందుచేతనంటే పాణిన్యాచార్యులంతమహానుభావుఁడుకూడా తనశాసనానికి భిన్నంగా సూత్రాలలో ప్రయోగిస్తూ వస్తే ఆప్రయోగాలుకూడా సూత్రప్రాయంగా పండిత లోకానికి ప్రవృత్తినివృత్తులను శాసించడం అందఱూ యెఱిఁగిందే. యీమర్యాదను అహోబలుఁడు వొక్కనన్నయ్యగారికే యిచ్చాఁడు. యితరలాక్షణికులో కవిత్రయంవారి ప్రయోగాలు యావత్తుకూ యిస్తూ వచ్చారు. ఆత్మకూరుపండితులతో మాకుకల్గిన విద్యావిషయికవాదంలో నన్నయ్యప్రయోగాలిస్తేనే తప్ప వారు వొప్పుకొనేవారు కారు. “దేవతలు ధర్మవర్తులు" అనేది నన్నయ్యగారిది కావడంచేతనే వారు తోసేయడానికి వల్లకాక “ధర్మ వృత్తులు" అని దిద్దడానికి వుపక్రమించారు. భవతు. మేము నన్నయ్యను గూర్చి వ్రాసినది బహుకవిసమ్మతమైనమాటగాని మాస్వంతాభిప్రాయము లేశమున్నూ కాదు.