పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిష్టషేషణము

493


యాపాతరమణీయమైనను విమర్శనమునకు జంకెడిని. సజాతీయ ప్రయోగాభావము ప్రస్తుతాభావమును సాధించుచో “గమ్, గామః, క్లమ్, క్లామః, క్రమ్, క్రామః" అను సజాతీయ ప్రయోగముల యభావము సర్వత్ర ప్రసిద్ధమగు "రమ్, రామః" అనుదాని కభావమును దెచ్చిపెట్టవలసి వచ్చును. వాది దౌర్బల్యమే కాని వాద దౌర్బల్యముండదు. వ్యవహారత స్సిద్ధములును, వ్యాకరణావిరుద్ధములు నగు ప్రయోగములను గూర్చి యింత చర్చయేల? ఈ విషయమునకు మేము చిరకాలమునాఁడె యుత్తరమును వ్రాసికొని యుంటిమి.

“తే. గీ. కేవల గ్రామ్యపదముల నేవగించి
         జనులు వాడెడి పదములు సమ్మతములు
         కలవు లేవని పెనఁగ శక్యంబె భార
         తాదులను లేనిపదములు నవనిఁ గలవె"
                                                  (దేవీ భాగవతము 1 స్కం.)

ఇఁక నొకటి, సమగ్రమగు వ్యాకరణము గల భాషలోని “ఫణినాపత్య” “వణినసూను” “మాధ్వీ" ఇత్యాది ప్రయోగములు మీ రెఱిఁగి యుందురు. వీనిం గూర్చి మీ అభిప్రాయమేమి? ప్రయోక్తలు శ్రీనాథుఁడు పెద్దన, ఎల్లమహాకవులను, గదా? ఇందుల కేమందము. మఱియు మీరు ప్రస్తుతము “సమదర్శినిలో" శాకుంతలమును గూర్చి విమర్శించుచున్నారు. చూచితిని. ఈ విమర్శనములను నేను విశ్వసింపను. ఆ గ్రంథకర్తల కీ మాత్రముగూడ దెలివితేటలు లేవని నే ననుకొనఁజాలను. ఇట్లే విమర్శించు నెడల నిలిచెడి కవితయే యుండదు. ఎట్లుండదో చూడవలెనని కుతూహలమున్నచో నిర్దుష్టమని మీకుఁబూర్తిగఁదోఁచిన యొక పద్యమునో་, శ్లోకమునో పరీక్షార్థముగ నా కొసఁగుఁడు. దానిని నే నెట్లు పాడు చేసి మీకుఁ జూపుదునో చిత్తగింపఁగలరు. మీరేకాదు, ఈ నూతన ఫక్కి విమర్శనములకు మా శిష్యులలోఁగూడఁ గొందఱు దిగియున్నారు. విన్నను, వినకున్నను వారికిఁగూడఁ బనిలోపనిగా నిది విమర్శనమార్గము కాదని తెలుపుచున్నాఁడను. మీ వ్రాఁతం దిలకించిన మీయందు బహుశ్రుతత్వము కలదని ముమ్మాటికిని దేలెడిని. అట్లు విశ్వసించుచుంగూడ నేనిట్లు వ్రాయుటకు మన్నింపఁగోరెదను. వ్రాయుటకన్నఁ బ్రత్యక్షములో మిమ్ము నంగీకరింపఁజేయుట సుళువు. కాని "శాస్త్రులవారికి" ఇత్యాదివాక్యమున కపార్థము చేసికొనుటచే మీరందుల కంగీకరింపరు. ఇఁక “సమాధాన ప్రాయములగు గ్రంథములనేనిఁ” బంపవలసియున్నది. వారిట్లు కోరుట యుక్తమే, తప్పక పంపవలసినదియే. కాని యవియన్నియుఁ బునర్ముద్రణమునకువచ్చి చిరకాలమైనది.