పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాండవాశ్వమేధము

485


తృణీకరణము 42వ పుట మొదలు 54వ పుట వరకును, శలభాలభనము 2 మొదలు 6వ పుటవరకును జూడఁదగు. శాస్త్రులవారేపొత్తమును విమర్శింపఁబూనిరో దానికి సంబంధించిన పాశుపతమునే చూడరైరి. పాండవవిజయమును జూడలేదని వారే వ్రాసియున్నారు. అది చూచినచో ఋతువిషయము వారికి గోచరించియేయుండును. వీ రసహాయశూరులగుటచే సాహసైక శరణ్యముగా వ్రాయుట కలవడినట్లూహింప నయ్యెడిని. అగుఁగాక. ప్రస్తుతవిషయమున వీరు కావ్యానుశాసన మొకపరి చూచుట యుక్తము. మఱియు, "చంపీచంపని ప్రయోగము సాధ్యమా? ఏ వ్యాకరణము?" అని యడిగిరి. ఇదియుఁ బాశుపతమున నుత్తరింపఁబడినదియే. ఇటీవల దిద్ది తగులఁబెట్టిన భారతముగాక ప్రప్రథమ ముద్రణమునందలి భారతము శాంతి, 2 ఆశ్వాసమునందలి “క. నమ్మమి మృత్యువు. నమ్మీ నమ్మక" అను ప్రయోగముచూచికొనఁదగు. ఇటీవల దిద్దుఁబాటువలన మూలాభిప్రాయము చెడుచున్నది. ఈయంశము నేఁటికిఁ జిరకాలముక్రిందట బందరునుండి వెలువడుచుండిన “ఆంధ్ర భారతి" అను పత్రికలో మాచేఁ బ్రకటింపఁబడిన వ్యాసమునందు - "ఉ. దిద్దకుండయ్య భారతము" ఇత్యాది పద్యములవలనఁ దెలియఁగలదు. మఱియు నీ– “నమ్మీ నమ్మక" అనుదానికి మా "చంపీ చంపని” అనుదానికే సంబంధముగలదు గాని విమర్శకు లీ సందర్భమున నుదాహరించిన "అన్నాదమ్ములు" లోనగువానికేవిధమైన సంబంధమును లేదని యెఱుఁగఁదగు. దీర్ఘమాత్ర సామ్యమేని లేదా? యందురేని అగుచో నిదిమాత్రమే కాదు. “విశ్వామిత్రాదులు" బోలెఁడు కలవని యెఱుఁగునది. -

ఇఁక వ్యాకరణమో, దీనింగూర్చి “తోడనేనా" అనుచో నుత్తరమున్నది. కనఁదగు. భారత మహాకవుల ప్రయోగమున్నను, "చంపీ ప్రయోగములు లేవు" అని వ్రాయుట సాహసైక శరణ్యము. లేదా? బుద్ధిపొరపాటు. మఱియు, “నికృష్టంపు జంపుఁజంపి" అనుదానిం గూర్చి యీ విమర్శకులు, అనాలోచితముగాఁ గొండొక వ్రాసి, చంపు - చావుగా దిద్దినఁ జక్కఁగనుండు ననిరి, పాపము! అమాయికులు. "అనుచితంపుఁజంపు” “జమిలి చంపులు” ఇత్యాది భారత ప్రయోగములు శాస్త్రులవారికి చావులుగా మార్పఁదగినవియే కాఁబోలును. ఈఘట్టమునందే "పంపుమయ్య" అనుదానింగూర్చి కొంత వ్రాసిరి. మరల, “ప్రయోగములున్నవి” అనియొప్పికొనిరి. ఒప్పికొనియు, విమర్శింతుము అని గర్జించిరి. ఈ గర్జన మెందులకో?

చాలీ చాలని వ్యాకరణము లేవియో కొన్ని యున్నవియే యనుకొందము. అంతమాత్రమున నీభాషాసముద్రము దరియ నీఁదఁగల మనియే కాఁబోలును శాస్త్రులవారి