పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/479

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

483


పాండవాశ్వమేధము

విమర్శనఖండనము

సుమారు 5, 6 మాసములనాఁడు బ్ర|| శ్రీ|| కాశీభట్ట కృష్ణరాయ శాస్త్రిగారు మా పాండవాశ్వమేధమును బ్రస్తుత నూతన విమర్శనము ఫక్కి ననుసరించి విమర్శించిరి. కొన్నిచోట్ల భవభూతికన్న గ్రంథకర్తలుమిన్నలని కొండనెక్కించిరి, కొన్నిచోట్ల దిగంద్రోసిరి. విమర్శింపఁదగిన సామగ్రి పూర్తిగా గలిగియున్నవారని మాకుఁ దోఁచియును నెక్కుడు సాహసించి వ్రాసిన యంశములు పెక్కు లున్నట్లు పొడకట్టుటచేఁ గొంచెము వ్రాసి కనుగొందమని యప్పటినుండియు ననుకొనుచుంటిని గానియప్పటికిఁ జాలఁబూర్వము నుండియుఁ బ్రాణాపాయకరమగు దీర్ఘ వ్యాధిలో నలుగుచున్న నే నింతదనుకు నేమియు వ్రాయనేలేకపోతిని. శాస్త్రులవారు “శ్రీ" కారము, కృత్యాదిని లేదని కొలదిగ శంకించి విడిచిరి. అది లేకుండుట ఆంధ్రాచార విరుద్ధమఁట. ఆంధ్రకవులు ప్రబంధములయందట్లు తఱచుగఁ బ్రవర్తించినమాట సత్యమే. నాటకములు వారిలోఁ బ్రాజ్ఞులు మా కాలమునకుఁ బ్రాక్కాలమున రచించినవారే లేరు. ఉన్నను, వారికిని విద్వత్తకును గడుం దవ్వు. అట్టిచో మేమనుకరింపవలసిన వారెవ్వరు? కాళిదాసాది గీర్వాణభాషాకవులుగదా? వారీ నియమమును బాటింపలేదు. కావున మేమును బాటింపలేదు. ఇవిగాక, “క. శ్రీకారముకృత్యాదిని" అను నాంధ్రపద్యమునకుఁ గూడ మాతృక “శ్లో దేవతా వాచకాశ్శబ్దా" అనునదియేకాని వేఱొఁడుకాదు. ఐనను ఆంధ్రులు అట్టి శబ్దములలో నొకటియగు శ్రీకారమును దఱచుగా వాడిరి. మేమో? “భారతః పంచమో వేదః" అనుటచే వేదవాచకమగుదానిని వాడితిమి. శ్రీకారమే యుండి తీరవలయునను నియమము లేనియపుడు వృథాగా వ్రాఁతపని కల్పించుట శోచనీయము. మఱియు, పాండు తనూభవు + లందు దుఃఖపున్ భారము అనుచోఁ బ్రమాదవశమున సప్తమ్యంతముగాఁబదచ్ఛేదము చేసికొని వృథాగఁబని కల్పించిరి. అందు + అనునది, దుఃఖభారమునకు విశేషణముగా నన్వయించికొనుమని మనవిచేయుచున్నారము. ఇందుల కాధారము ముద్రణ సంప్రదాయమునందలి స్పేసుగూడఁ గావచ్చును గాని వీరు చూచినదే పుస్తకమో, బహుశః, సపాశుపతమైయుండదు. అగుచో ద్వితీయ ముద్రణమున మేము కొందఱచే శంకింపఁబడి