పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

478

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆయన వ్రాస్తూ వున్నారు. ఆయన శంకల మాదిరి యెట్టిదో యింతవఱకు నేను వ్రాసిన సమాధానాలవల్ల లోకులు తెలిసికొనివుంటారు. మళ్లా మొదలెట్టిన శంకల వైఖరి చూపుతాను. మచ్చుకు మాత్రం వకటి రెండు, యెక్కడో మానాటకంలో “నలుగురు” అనడానికి "ముగ్గురు" అని పడిందనుకోండి. దాన్ని శుద్ధపత్రంలో సూచించాము. అంతేకాక వేఱొక ముద్రణంలో సవరించాము. అదిచూడక ఆయన వెక్కిరించారు. సమాధానంలో వేఱొక ముద్రణం చూడవలసిందన్నాను. చూచారుకాని యింకా వకచోట “మూగురు” అనే వుందఁట. అదుగో విజయానికాధారం దొరికిందనుకున్నారు. దీనికే ముద్రణం చూచుకోవాలో చెప్పుమంటారు. చిన్నతనమయితే చిన్నతనంగా వుండాలికాని యీ విమర్శనా లెందుకో గదా! శుద్ధపత్రికలో చూడక వెక్కిరించడమా? వేఱొక ముద్రణంలో వున్న సవరణ గమనించక వెక్కిరించడమా? అందులో యింకావకటి మిగిలిందంటూ మళ్లా అడగడమా? వకచోట సవరణకనపడ్డప్పుడు సజాతీయ విషయమైనప్పుడు మళ్లా తెలపడమెందుకో గదా! “ముద్దముద్దకీ మిస్మిల్"లా కావాలి కాఁబోలు!

యింకొకశంక. యెక్కడో వ్యాకరణశాస్త్రమర్యాద మాటలు పడ్డాయి మా నాటకంలో, వాట్లనుగూర్చి కొంత సందేహించారు విమర్శకులు. యేమనుకోను? మురారి మహాకవి తన నాటకంలో (1) “జనికర్తుః ప్రకృతితా", (2) “కథ మపత్యప్రత్యయా న్నిశ్చినోమి", (3) "బ్రాహ్మణాదేశో౽పిస్థానివద్భావేన" (4) "ప్రకృష్టకర్తృభిప్రాయక్రియాఫలవతః" యిత్యాదులు బోలెఁడు వాడివున్నాఁడు. అయినా యీయనకు ఆయీ వుదాహరణాలు, కవులపోకడలూ, చూపడంకన్న నీవు మాపుస్తకాన్ని గౌరవించవద్దు. నీవద్దనున్న పుస్తకాన్ని చింపి పారవేయవలసింది. సొమ్ముపెట్టి కొనుక్కొని వున్నయెడల ఆనష్టం మామీద కడితే యిచ్చుకొంటాము. అని ప్రార్ధించడం వుత్తమం అనితోఁచింది. యీ అంశం పాణిగృహీతా పీఠికలో యిదివఱకే సూచించి యున్నాముగదా?

యీయనకు "గంధర్వలోకం" లోనుంచి లేఖలు వస్తూవున్నట్లు వ్రాశారు. దాని నంబరు 14 అని అంకెనుకూడా తెల్పివున్నారు. నాకున్నూ ఆలేఖ వచ్చింది. నాకువచ్చినదాని నంబరు 12 అని మనవి చేస్తూవున్నాను. దానితత్త్వం పూర్తిగా కనిపెట్టాను. దానితో విమర్శకుఁడుగారికి వున్న బాంధవ్యం పూర్తిగా తెలుసుకున్నాను. “యుష్మద్గోత్రం వర్ధతామ్" అని ఆశీర్వదిస్తూవున్నాను. అది విమర్శకుఁడుగారు ప్రచురించడానికి సంశయించినా కాలాంతరమందు నేను ప్రచురింపడానికి సంసిద్ధంగా వున్నాను. దానితో మీయోగ్యత బాగా లోకులు తెలుసుకుంటారు. ప్రస్తుతం మీరు తి. వెం. కవులు పింగళివారిని వెక్కిరించారని వేసిన అపవాదాన్ని స్థిరీకరించుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి.