పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

476

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


లిఖించారు. అయితే మొట్టమొదట యేలా వ్రాశారు - ఆ వ్రాఁతలో వున్న లోటేమిటి - యిప్పుడీలా వ్రాయడం యెందుకు అవసరమయింది అని చదువరులకు శంక కలుగకమానదు, కాఁబట్టి పూర్వాపర సందర్భంగా వాటివాటిని వుదాహరిస్తాను. అని చెప్పుటచే నీపాత్రలో వేంకటశాస్త్రిగారు ప్రనతిఫలింపఁజూచినారని చెప్పవలయును. కాఁబట్టి శుచిముఖిపాత్ర అసందర్భస్థితిలో నున్నదని చెప్పవలసివచ్చినది. వెక్కిరింపఁబోయి బోల్తాపడినట్లు ప్రతిఫలింపఁబోయి ప్రత్యక్షవిరోధమును పరిశీలింపలేదు” అని విమర్శకుఁడుగారు మొదట వ్రాసివున్నారు. దానిని నేను చూచి వ్రాసిన మాటలుకూడా వుదాహరిస్తాను-

"ప్రతిఫలింపఁబోయిన దెవరు? వేంకటశాస్త్రిగారు. ప్రత్యక్షవిరోధమును పరిశీలింపని దెవరు? ఆయనయే కదా? వేంకటశాస్త్రిగారు చేసిన యపరాధము శుచిముఖీపాత్రలో ప్రతిఫలింపఁ బోవుటయేకదా? అగుచోనది వెక్కిరింపఁబోవుటవంటిదే యగునా? కానిచో ఆలోకోక్తిని వాడుటకర్థము లేమి స్పష్టమేకదా? అగుచో యీ విమర్శకునకు చక్కగా నాలుగు వాక్యములు వ్రాయుటకూడ నేర్చికోcదగిన యవస్థయేకదా? అగుచో నెక్కడనో ఉపాధ్యాయులుగా నెటులుండిరని శంకరావచ్చును".

యిత్యాది వాక్యములతో ఆలోకోక్తిని వాడడం బాగుందికాదని ఆయనకు తెల్పివున్నాను. దానిమీఁద దాన్నేలాగో సమర్ధించడానిక్కాఁబోలు వక యెత్తు యెత్తేరు. దాన్ని చూపుతాను.

"వెక్కిరింపఁబోయి బోల్తాపడినట్లు" అను వాక్యమునకు నాయభిప్రాయమిది. తాను బ్రతిఫలింపఁదలచుకొనుటచేఁ బింగళి సూరనార్యుఁడు శుచిముఖిపాత్రను గవయిత్రిగాను, విదుషిగాను, మాత్రమే చూపియున్నాఁడు. అంతమాత్రమునఁ బ్రకృతమునకుఁ గల్గు ప్రయోజనముకంటె ధారణాసంపత్తితోఁ గూడికొనినదని చెప్పుటచేఁ బ్రయోజన మెక్కువగా నుండు ననితలఁచి, పిం. సూ. కంటెఁ దమ కెక్కువశక్తి కలదని చూపుటకేకదా వీరారీతిగా వ్రాసియున్నారు. దీనివలన పిం. సూ. కవియుఁ బండితుఁడును మాత్రమేకాని శతావధానాదికమును జేయఁగలవాఁడుకాఁడు. మేమో?- కవులము, పండితులము, శతావధానాదికమును జేయఁగలవారమునని లోకులకుఁ దెలియబఱచుటకే కదా - ఆవిషయమునుగూడఁ దఱచుగా వ్రాయుట. కాఁగా, ఇది పిం. సూరన్నను "వెక్కిరించుట కాదా?" ఇట్టి యభిప్రాయముతో వ్రాసిన నావాక్య మేల ప్రకృతమునకు సమన్వయింప కుండును? నా యూహ తెలియక శ్రీ శాస్త్రులవారు... ..." అని తాము మొదటచేసిన అవ్యక్తప్రసంగాన్ని సమర్థించారు విమర్శకులు. యిది "అబద్ధాలాడి దిద్దుకోవటం" వంటిది కాకపోయింది. పైఁగా వకతప్పుచేసి దాని సమర్ధనంకోసం అంతకంటే కూడా పెద్దతప్పు