పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

470

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విద్యావిషయపుసమ్మానములు నూటఁదొంబది తొమ్మిదిన్నఱవఱకు జంటగానే జరిగినవి. తక్కిన యఱయు ప్రత్యేకించి జరిగినను అయ్యదికూడ నిరువురము జమకట్టుకొనువారము. ధనవిషయమునఁ గూడ నిట్లేయని యెఱుఁగఁదగు నని చదువరులకు నాయొనర్చు విజ్ఞప్తి. సుమారు నలువదియేండ్ల నాఁడు నేను జీవిత సంశయావస్థలో నున్నప్పుడు శ్రీజయంతి రామయ్యపంతులవారు నరసరావు పేటలో డిప్యూటీ కలెక్టరుగా నుండి మమ్మవధానార్థ మహ్వానించిది. అపుడు తి. శా. గారు మాత్రమే వెళ్లిరి కాని, అట జరిగిన సమ్మానము తి. శా. గారింటనేయున్న నాకును బంచి పెట్టిరి. బందరు నేను ప్రవేశించుటకు మున్నొకటిరెండు సంవత్సరములు మాత్రము మాలో మా కీవిషయమునఁ గొంత చర్చజరిగి పృథక్త్వము తటస్థించినది. అప్పటిదే శ్రీకాకుళము, మందసా, నూజివీఁడు లోనగు కొన్ని సభలలోని సమ్మానము. అది తప్ప పృథక్కరణము మాకెన్నడును ద్రవ్యవిషయమున లేనేలేదు. రచనలో నపుడును లేదు. అంత నేను బందరు ప్రవేశించితిని. వెంటనే శ్రీ వానమాలస్వామివారి యాహ్వానము సంఘటించినది. కలిసియే వెళ్లితిమి. పిమ్మట బందరులో నన్ను సమ్మానించుటకై పౌరులు చేసినసభ బొత్తిగా కవిత్వమునకు సంబంధించినది కాకపోఁబట్టి సభలో తి. శా. గారి ప్రసక్తియేమియు లేని కారణమున దాని కతఁడు నల్వురు పండితులతో పాటుగ నాహ్వానింపఁబడియు రాలేదు. పదపడి యతని జీవితాంతమువఱకును కలిసియే అన్నవరోత్సవాదుల కరుగుచుండుట ప్రసిద్ధమే. అతని స్వర్గతి యనంతరమునఁ గూడ నేను అన్నవరపు వార్షికమును గొన్ని సంవత్సరములవఱకు నాతని కుటుంబమునకు సరిగా పంచిపెట్టుట ఆ జమీన్‌దారు లెఱిఁగినదియే! పిమ్మట జమీన్‌దారులే పంచిపెట్టకుండ నాఁపుచేసి, తి. శా. గారి కొమరునకు వేఱుగా వార్షికము నేర్పఱచిరి. మఱియు నేలూరిలో తి. శా. గారి స్వర్గతికిఁ జాల నిటీవల శ్రీ మోతే నారాయణరావుగారు మా మృచ్ఛకటికమును బ్రదర్శించుచు నన్నాహ్వానించి నూటపదాఱులు సమ్మానించిరి. అది సైతము నేను పంచి యిచ్చితిని. ఇంతయెందులకు వ్రాయవలసివచ్చినదనఁగా, మాకుఁగల కవితాసంబంధ మిట్టిదని తెల్పుటకే. అతనిబంధుగులెల్లరు నన్నతనింబలెఁ బ్రేమించి వరుసవావులతో గౌరవింతురు. నాబంధువు లతనింగూడ నట్లే, ఈవిషయము ప్రస్తుత విమర్శకబుధుఁడుగారి తండ్రిగారును, పెద్దతండ్రిగారును గూడ నెఱిఁగినదే. జీవిత కాలమునందలి యవినాభావమును గూర్చి కొంతయు, తి. శా. గారి జీవితముతరువాతి యవినాభావమును గూర్చి కొంతయు సంగ్రహముగా వివరించితిని. భవిష్యద్విషయమున నాయభిప్రాయ మెటులున్నదో తిలకింపుఁడు. ఇటీవలి చర్యనుండి,