పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

466

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

రాజ - “నేను గొంత పరివారముతో,

క. విద్వాంసు లనేకులుగల తద్ద్వారక కేగి శతవధానముచే... ... "

పైగ్రంథమువలన శుచిముఖి యొంటరిగా వెళ్లలేదనుట స్పష్టము. ఆ పరివారములో శుచిముఖితో నాఁడవధాన మొనర్చునపుడు తోడుగా నున్న హంస మాంతర్గతము. కావుననే, ద్వితీయాంకమున శ్రీకృష్ణుఁడు, “మీరిరువురును కన్నులకుఁ గట్టినట్లగపట్టిన ట్లయ్యెడిని" అనియు, పరిచారకుఁడు “మీరిరువురు గాదూ?" అనియు నడుగుట సంభవించిన దని బాలురకుఁగూడ సుగమమే. అయినను విమర్శకబుధుఁడుగారి కీయంశము గోచరించినట్లు లేదు. ఈ విమర్శకుఁడు తుట్టతుద కేదో చేదస్తపు వ్రాఁత వ్రాసివ్రాసి తిరుపతి శాస్త్రిగారు ప్రతిఫలనము నంగీకరించిన ట్లీయక్కరములు తెల్పెడిని. "తిరుపతి శాస్త్రిగారు ప్రతిఫలించుట గమనింపక కాఁబోలు వేంకటశాస్త్రిగారు. నాటకమును వ్రాయుటకు ప్రారంభించిన తిరుపతిశాస్త్రిగారు స్వవిషయమును తెలియఁబఱచుటలో లోపమేదియును గానరాదు" పైయక్కరములు తి. శా. గారి ప్రతిఫలనమంగీకరించినట్లగుపట్టెడిని. కాని యీ విమర్శకునకు ప్రథమాంకప్రారంభమునందలి తి. శా. గారి యీవాక్యమేల విరోధింపదో చదువరులు పరికింతురుగాక.

“శతావధానులు తిరుపతి వేంకటేశ్వరులు రచించిన ప్రభావతీ ప్రద్యుమ్న నాటకమే నేఁడు ప్రదర్శింపఁబోవునది” ఉభయకర్తృకత్వ మున్నప్పుడు ప్రతిఫలన ముభయులకును వివక్షితమై తీరవలసినదే కదా! అట్లయ్యెనేని విమర్శకుఁ డొక్కరికిఁ ప్రతిఫలన మెట్లు సమంజస మనుకొనెనో? మఱియు, “నాకవిత్వంబునకు మెచ్చి సరస్వతియే బాలసరస్వతియను బిరుదొసంగి యీ గండ పెండేరంబు కాలికిం దొడిగె.” బాలసరస్వతీ బిరుదమునటుంచి ఈ "గండపెండేరము' అనుదానిని సమన్వయ మెట్లుచేసికొనెనో? ఇది బందరునుండి యుపాధ్యాయత్వము విరమించుకొని వచ్చునప్పుడుగదా యిచ్చినది. అగుచో నాయుపాధ్యాయులు తి. శా. గారే యనుకొనెఁగాఁబోలు! పోలు!! పోలు!!! కాకినాడలో నున్నది యెవరో, బందరులో నున్నది యెవరో తెలిసికొనుపాటి వివేచనము తెలియనితాను ఆయన ప్రతిఫలనము యుక్తము, ఈయన ప్రతిఫలన మయుక్తము అని చేటభారతము వ్రాసెనే! ఔరా! సాహసము! పోనీక్షణకాలము తి. శా. గారు, కాదు వేం. శా. గా రొక్కరే ప్రతిఫలించినట్లు వ్రాయవలెననుకొని విమర్శకుఁడుగారు“టెంకాయిపిచ్చికొండ" చేసి రనుకొని పరిశీలింతమా? అప్పడీయక్కరములు కుదురవు. “మఱియు రాజరాజేశ్వరీషోడశీ మహావిద్య నభ్యసించితి" వేం. శా. గారి ప్రతిఫలనమున కీ “రాజరాజేశ్వరి" వ్యతిరేకించును. ఇది ప్రత్యేకించి తి. శా. గారికే సంబంధించినది.