పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

462

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యీలోcగానే యీపక్షుల వివాహము జరుపవలె నని నిర్బంధింతురు కాఁబోలును! ఇతరుల కెటులైనను మాకును, ఈయనకును ఫ్రెంచిటవును యానాము పరిచయము పూర్తిగా నుంటచే బిల్లుబాధకు మేము భయపడము. అయ్యో! విమర్శనమా! నీకెన్నిపాట్లు వచ్చినవి! నీకర్మ మెట్లు కాలుచున్నదో చూచితివా? "కాదు, ఇది హూణభాషావేత్తల సంప్రదాయపు వాసనతో మిళితమైన విమర్శన" మందువా? అఘోరించినట్లే యున్నది నీ సమాధానము. చెప్పెద నాలింపుము. కాళిదాసు నెఱుఁగుదువా? రఘువంశ మెఱుఁగుదు వనుకొందును. అగుచో నందినీధేనువు నెఱుఁగకుందువా? ఎఱుఁగుదువు. దానియందున్న మహత్కార్యములను మాత్రమేల యెఱుఁగకుందువు? అగుచో ఆ నందినీధేనువునకు పంచభక్ష్య పరమాన్నములను బెట్టింపక కాళిదాసు దిలీపమహారాజు వంటి చక్రవర్తిచేత గడ్డినే పెట్టించినాఁ డేలొకో? తెలిసికొంటివా? -

“శ్లో. ఆస్వాదవద్బిః కబళై స్తృణానామ్" - (రఘువంశము. 2 వ సర్గము)

ఎంత మహద్వివక్షకు తగినదానికేని జాతిధర్మ మనివార్య మనియే కద! ఆనందినీధేను సంతానమునకు దాంపత్యవిషయమున వరుసవావులుండునా? లోకముననున్న పశువులలో నెక్కడనేని యీ విషయము నెఱుఁగనివారు మనుష్యమాత్రులలో నేజాతిలోనేని గలరా? భవతు. అది పక్షివిషయము. ఈదృష్టాంతము పశువిషయ మందువేమో, పక్షులకు మాత్రము వరుసవావులున్నవా? హంసముల నెఱుఁగవుగాని పావురములనేని యెఱుఁగవా? ఏకగోత్ర జనితులకఁట! వివాహమఁట! అంగీకరింపవలయునఁట! మేలు! మేలు! మాటలాడనేర్చిన మాత్రాన జాతిధర్మములకు స్వస్తిచెప్పునెడల శ్రీహర్షాదుల కీజ్ఞానమేల లేకపోయినదో? "మృణాలాగ్ర భక్తులనుగా" శ్రీహర్షుఁ డాహంసముల నేల చిత్రించెనో కదా? చిత్రించుఁగాక. దానినాంద్రీకరించిన శ్రీనాథునకుఁ గూడ సవరించు తెల్వి లేదాయెనే! "రసంబు పోషించియు అనుచితంబు త్యజించియు" ఇత్యాదికము లెన్నోమాట లుపోద్ఘాతములో వ్రాసికొని కదా శ్రీనాథుఁడాంద్రీకరింప మొదలిడినాఁడు?

“చదలేటి బంగారుజలరుహంబుల తూండ్లు
 భోజనంబులు మాకుఁ బూవుఁబోడి"

అని యేల యాంద్రీకరించెనో? మనుష్య భక్షణ యోగ్యమైన వస్తువులనే భక్షించెదమని హంసచేఁ జెప్పించినచో “విమర్శక బుధుఁడు” గారి వంటివా రానందింతురుగదా! స్థాలీపులాకన్యాయమున "వెక్కిరింపఁబోయి” అనుసామెతను వాడినస్థలమునుబట్టియే “విమర్శకబుధుఁడు”గారి తెల్వితేటలు స్పష్టమయినవిగదా? పిమ్మట విమర్శించు పొత్తమునంగల సవరణను గుఱుతింపక వృథాసోదెను పెంచి విలువగల భారతిపత్రికకు