పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/450

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

454

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కొంత గ్రంథాన్ని కూడా వుదాహరించారు. యివన్నీ నాకు తెలియవన్నారు. సమ్మతమే, వారికి తెలిసిన లాభమేమి? తెలియనివాళ్లు తప్పుత్రోవ తొక్కటంకన్న తెలిసినవాళ్లు తొక్కడమే తప్పుగాదా? ముఖ్యంగా ఆచార్యులవారు మమ్మల్ని కదపడం సదుద్దేశమా దురుద్దేశమా? అన్నది తేలాలి. నాకు తెలియని అంశాన్ని వారీ వ్యాసంతో బోధించే సందర్భంకూడా తేలాలి. లోపం తమది కనపడుతూంటేనే ఆచార్లగారింత తొందరపడ్డారు, లేకపోతే యెంత తొందరపడతారో, తమకే యింత యిబ్బందిగా వుంటే వారన్నట్లు వయోమాత్రవృద్ధత్వమేనా వున్న నాకు తమరుచేసిన యయుక్తకార్యంవల్ల యెంత యిబ్బంది వుండాలో? యేమీ? నాజోలికే రానట్టున్నూ నేను వారిమీఁదకు వృథాగా వెళ్లిదూషించినట్టున్నూ, అపలపిస్తారే ఆచార్యులుగారు? యింతమాత్రంతోనే పోతుందా? నాప్రకృతే దుస్త్యజమో, లేక తమకే అది వర్తిస్తుందో తేలేకాలం వచ్చిందనుకుంటాను. లేకపోతే వారుదాహరించు కోతగ్గదోషాలకు కవిత్రయం మొదలైన వారి ప్రయోగా లుండఁగా మావంటి 'లాకలూకాయలని' తడవడమెందుకు వస్తుంది? 'ఫలానుమేయాః ప్రారంభాః’ కదా! ఆకాలంనాఁటికి ఆ మాటలకు దురర్థం లేదంటూ వక ఆభాసవాదాన్ని లేవదీశారు స్వామి. యీవాదం నిలిస్తే చూస్తాను నేను. సూరన్నగారి గుద్దలిలో 'గుద్ద' పదం యెంతఅపకారం చేయాలో అంతా యీవాదానికి చేసితీరుతుంది. యిది తెలుఁగులో వచ్చింది కనక వాదం తెలుఁగే వుదాహరించాను. సంస్కృతమ్మట్టుకు సంస్కృతానికిన్నీ వున్నాయి బోలెఁడు. భారవిలో కాఁబోలును- “శ్లో ఈశార్థం" అనిపడ్డది. "పంచాంగవినిర్ణయోనయః" అనిన్నీ పడ్డది. శేఫాలికా పుష్పశబ్దం వకటి మహాకవులు తఱుచు వాడుతూ వుంటారు. ఇంకాయెన్నో వున్నాయి. యేమీ ఆధారాలు లేకుండా “కారుణ్యం" వేయడాని కుపక్రమించలేదు. చూపినవాట్లలో శార్ధం శ్రాద్ధానికిన్నీ యింకొకటి గుహ్యావయవానికిన్నీ వేఱొకటి పురుషగుహ్యావయవానికిన్నీ స్ఫోరకత్వ వాచకత్వాలకు పనిచేస్తాయి. అయితే ఆ కవులందఱూ అప్రాజ్ఞులే అంటూ వాదిస్తారని స్వామివారిథోరణి సూచిస్తూవుంది. అందుకే. అది తేలడానికే యీ వయోమాత్రవృద్దుఁడి పరిశ్రమ. లేకపోతే- "లక్షణమున్నను" అని వ్రాస్తూ కూడా “కారుణ్యాని” కుపక్రమిస్తానా? కాళిదాసాదుల కాలానికిన్నీ ఆలంకారిక వామనుని కాలానికిన్నీ కలభేదమే నాకు తెలియదనిన్నీ కాళిదాసుకవిత్వానికిన్నీ అంధ్రదేశ వ్యవహారానికిన్నీ యెట్టి సంబంధమో తెలియదనిన్నీ మొదలెట్టిన శ్రీమానులవారి సాహసం వర్ణనీయం. నేను నూటికి ముప్బెయయిదో, లేక నలభైయో మార్కులు తెచ్చుకోలేదుగాని యీ తెచ్చుకున్నవారికి పాఠం చెప్పే శిష్యులున్నూ, వీరందఱిమీఁదా సర్వాధికారం వహించేశిష్యులున్నూ, నాకు పలువు రున్నారనియేనా స్వామి సంశయించలేదు. నేనొక వేళ వృద్దుఁడనవడంచేత యీవాదం తేలేలోఁగా పరమపదిస్తానని ధైర్యమేమో స్వామి