పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/448

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

452

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అవమానించడానికి మాత్రమే పనికిరావలసి వుంటుంది. స్వామి యేమంటారో చూదాం. యేకవి వాడింది అశ్లీలంగా వుంటుందో ఆమాట ఆ కవికాలంనాటికి దురర్థాన్ని యిచ్చేదిగా వుండి వుండదంటూ తేల్చారు స్వాములు. “సాని, అనుష్ఠించు" వీట్లనట్టివిగానే అభిప్రాయపడ్డారు. సందిగ్ధ విషయంలో వ్రాయడంలో మొదలిడితే వ్రాఁత మిక్కిలి పెరుఁగుతుంది. సందేహం లేనిదాన్నే చూపితే బాగుంటుంది. ఔచిత్యాది విషయములకు పింగళివారిని అగ్రగణ్యులుగా స్వాములు వప్పుతారేమో, లేక వారికిన్నీ వుపాధ్యాయత్వానికి సిద్ధాపడతారా?

“తగు చోట్లు గుద్దంటఁ ద్రవ్వి త్రవ్వి"

అని సూరన్నగారు ప్రయోగించారుకదా? ఆచార్యులవారు మావంటి "లూకలూకాయల” ప్రయోగాన్ని దోషాల కుదాహరణంగా చూపుకొని "గిల్లికబ్జాకు"దిగి తోఁచీ తోఁచని వ్రాఁతలు వ్రాస్తూ మాకు పని కల్గించడంకన్న ఆసూరన్నగారి వంటివారిని వుదాహరిస్తే లోకం "మెచ్చి మేకతోలు గప్పుతుం" దేమో? వీరిని నేను జ్ఞానలవదుర్విదగ్ధ పదభాజినిగా చేసినందుకు మిక్కిలి కినిశారు వీరు. వీరు చేసినపని యెట్టిదో చూడండి. వీరెత్తుకొన్న చోటున మేము చిరకాలం నాఁడే వ్రాసిన అక్షరాలుదాహరిస్తాను-

(పాశుపతమునుండి)

“పృథ్వీభరం బొక్కటా?" ఇట బొక్క అని విడఁదీసి దోషము నాపాదించుట లాక్షణికుల మతమే గాని, ముం “దీబొక్క" పదమునకేమి, పాఱు, ద్రొబ్బు, లోనగువానికేమి గ్రంథకర్తల మతమున దురర్థమున్నట్లు తోఁచదు. కావుననే "బొక్కనీరు (మార్కం. 3 అ)" అని మారన్న ప్రయోగించినాఁడు. పాఱు, ద్రొబ్బులకు సర్వత్ర చూడుఁడు. దురర్థము వచ్చినను నంగీకరించి సంధిస్థలముల నిట్లు భారతాదికము నిరాఘాటముగాఁ బ్రవర్తించుచున్నది. “చ. హారితా జయమొడఁగూర్పకున్న (భార-ఉద్యో 2 ఆ). ఇట్టివి పెక్కులు శృంగార రసమున నించుక పరిశీలింప వలసి యుండునుగాని యందును బ్రాచీనులు గణింపరైరి.

“సీ ... ... తగు చోట్లు గుద్దంటఁ ద్రవ్విత్రవ్వి (కళాపూ- 4 ఆ)”.

యిట్లు చిరకాలంనాఁడు సమాధానం వ్రాసి ప్రచురించిన విషయాన్ని యెత్తుకోవడంలో శ్రీ ఆచార్యులవారి హృదయం యేలాటిదిగా కనబడుతూ వుందో ప్రాజ్ఞులు విచారించాలి. యీ విషయంలో నాకు తెలియని దేమిటి? ప్రాజ్ఞలోకమే నిర్వచించాలి. “గుద్దపదం సూరన్నగారి కాలానికి సదర్థాపాదకమే" అనేవారుంటారా? ఆచార్లగారివాదం ఆతోవలో వుంది. వారిని నేను జ్ఞానలవదుర్విదగ్ధు లనడం స్వభావోక్తియైతేనే లోకం విశ్వసిస్తుంది. యీ క్రింది సందర్భం చూడండి-