పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

450

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“పృథ్వీభరం బొక్కటా" అన్నది. “పృథ్వీభర మ్మొక్కటా?" అంటే వారన్నదోషం అక్కడ రాదు. ఆచార్లువారి గ్రంథమంతా తప్పుల తడక కాకుండా వారు వ్రాసిన రక్షకవాక్యం వకటి వుంది. ఆవాక్యాన్నే తి. వెం. కవులకు వక అఱనిముషం యెరవుగా యిస్తే అది సవరణ అవుతుంది. ఆ వాక్యం చూపుదునా?

"నాగ్రంథము తప్పులతడక యనియు. వ్రాసితిరి... అచ్చువేయించుటలో జరిగిన లోపమువలన నట్టి వ్యత్యాసము జరిగినది." యీ సంరక్షణవాక్యం శుద్దాబద్ధమైనా వారి గ్రంథాన్ని యావత్తూరక్షించింది కాని మా “పృథ్వీభరం బొక్క" అన్నదాన్ని సంరక్షించలేక పోయింది. చూచారా ఆచార్లవారి సాహసం! యింతకూ ఆచార్లవారు ముందుమమ్మల్ని కదిపినారా లేదా అన్నది ప్రస్తుతం. గుణవిషయంలో వకటిన్నీ వుదాహరించక దోషవిషయంలోనే (నేను వకటే అన్నాను, కాదు పది అంటూ వున్నారు శ్రీమంతువారు. . యీవ్రాఁత నాకు మఱీవుపకారకం. ప్రియం నఃప్రియంనః) అన్నీ వుదాహరించడంవల్ల వారు నిద్రిస్తూవున్న నన్ను కదిపినట్లయిందా? అందుచేత నేను వారినిగూర్చి యెత్తుకోక తప్పిందికాదు. యిదివఱలో మాకువున్న ప్రతిజ్ఞాస్వరూప మెవరెఱుఁగరు?

“ఉ. కొండల నోరఁజేసికొని కొంత వడిం బఱతెంచి యంతను
     ద్దండత దారికడ్డమయి తాఁకి హళాహళిసేయు కొండలన్
     బిండిగఁ జేసి రైలు కడువేగమునం బఱతెంచునట్లు భూ
     మండలి మాకవిత్వమును "మంకుఘటమ్ముల!" జెండిమీఱుతన్."

అనేది మా ప్రతిజ్ఞ. అంతేనేకాని యెవరిమీఁదికిఁ గాని మా అంతట మేము పోలేదు, పోము. ముందవతలవారు మాట మిగలాలి. యిది చదువరులు బాగా విచారించవలసిన విషయం. తరువాతంటారా? 'ఆసీమాంతం' చేసిగాని విడిచేదిలేదు. సరే! యీ మాటల కేమి? యిదివరలో మీకు వాదోపవాదాలు యే "లాకలూకాయల" తోనో వచ్చాయి. కాఁబట్టి మీ ఆటసాగింది. యిప్పుడో “యినపగుగ్గిళ్లుగాని, మినప గుగ్గిళ్లుకావు" అంటారా? సమ్మతమే. శ్రీమంతులవా రట్టివారే! యెట్టివారున్నూ కాకపోతే నిద్రపోతూవున్న వాణ్ణి . పనిగట్టుకు లేపుతారా? వస్తే వోడే రానివ్వండి. పాములను పట్టుకొని ఆడించేవాడిగతి - తుద కేమవుతుందంటారా? ఆలాగే చెప్పుకుందురుగాని తరువాత మీరు. యిప్పుడల్లా విచార్యమేమిటి? వారి గ్రంథంలో మాప్రయోగాలనిదోషాలకే యెత్తుకొని యితరానికి లేశమున్నూ యెత్తుకోని ఆచార్యలుగారి హృదయం యెట్టిది? యిందుకు ఆచార్యలు గారు పెరుమాళ్ల సాక్షిగా జవాబు వ్రాస్తే అది లోకానికి నచ్చినా నచ్చకపోయినా నేను వారికి దాసోహాలు చెపుతాను. యింతవఱకు నేను వ్రాయఁబోయేదానికి వుపోద్ఘాతం.