పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

447

 వాదించే శుంఠనని తామనుకొనుచున్నట్టు మీవ్రాఁత ధోరణి తెల్పుతూ వుంది. ఆ వాదం నాదికాదు. మీరు దోషాలకే మావి వుదాహరించుటలో మీహృదయం యెట్టిది అని తెలుసుకోవడమే నాకు కావలసింది. దానితో సకలమున్నూ తేలిపోతుంది. యీవాదం తేలడానికి నా "వయోమాత్రవృద్ధత్వమే” పర్యాప్తమవుతుంది. దీనిలో జయం పొందడానికి మీ “విద్యా మాత్ర వృద్ధత్వం” లేశమున్నూ పనికిరాదు. “అభణ” వగయిరాలు మీ “విద్యామాత్ర వృద్ధత్వాన్ని" పూర్తిగా కుంకటి వ్రేళ్లతో పెకలించి తీరుతాయి, చూస్తురుగాని. తి. వెం. కవుల రచన దోషాలకు మాత్రమే వుదాహరించుకోతగ్గదికాని, గుణాల కుదాహరించుకో తగ్గది లేశమున్నూ కాదు- అనే అంశాన్నే మొట్టమొదట మీరు సాధించఁదగ్గది. జ్ఞాపకముంచుకోండి, మీకు నేను వ్రాసిన యే అక్షరాలు కోపముకల్గించి వెఱ్ఱి మొఱ్ఱి ప్రసంగాన్ని పత్రికాముఖమున ప్రకటింపఁజేశాయో, ఆ మాటలు మళ్లా వుదాహరిస్తాను. కొంత శాంతించి దానియందుండే ప్రధానాంశాన్ని మనస్సుకు పట్టించుకోండి.

"జ్ఞానలవదుర్విదగ్ధు లేదో మాకు వృథాగా పనికల్పించుట మానకున్నారు. ఇదికాక యీ శిరోమణిగారికి మా రచించినవి పెక్కు గ్రంథములుండఁగా, ఈ “బొక్క" మాత్రమే యుదాహరించుటకు దొరకెనా? దీనివలన నీయన కేవల రంధ్రాన్వేషణతత్పరుఁడనియును, అందుచే 'బొక్క' దొరికియుండు ననియు ప్రాజ్ఞులనుకొని దీనికి సంబంధించిన శ్లోకమున పఠింతురు కాఁబోలునుఁ శాంతం పాపం!!”

ఇవిగదా నామాటలు? మీకు కోపంవస్తే లాభమేమి? చేసినపని తప్పుపని, భారతి నాచేత తగినమాటలు పలికించింది. యిఁకనేనా సంతోషించి నన్నుఁగూర్చి పడ్డతొందరపాటుకు పశ్చాత్తాపపడండి స్వామీ! “సత్కవి వాక్యము రిత్తవోవునే" నేనుసత్కవిదాకా యెందుకు-కవి నేనా అయితే (మీహృదయాన్ని బట్టి కాదుసుఁడీ) మా విషయమున మీరు నడచిన నడతనుబట్టినేను మీ కొసఁగిన “జ్ఞానలవే” త్యాది బిరుదావళి మీరు కష్టించి గురుశుశ్రూషచేసి సంపాదించిన "శిరోమణి" బిరుదంకన్న మిన్నయై ప్రసిద్ధికి వస్తుందని నాపూర్ణవిశ్వాసం. యేవోనాలుగు పుస్తకాల్లో వాక్యాలు యేకరువుపెట్టి-

“యివి మీకు బొత్తిగా తెలియనివి, అసలేతెలియనివి" అనే అర్థమిచ్చే పేలవంమాటలు వ్రాసినంతతోనే తేలిపోతుందనుకున్నారా స్వామీ? మీరొనర్చిన యసంగతపుపనివల్ల మీకున్ను మాకు వయోముఖ్య సందర్భాల్లో దేనియందున్నూ లేశమున్నూ పోలిక లేకపోయినా యేదో యింతవఱకు నాకు మాత్రం గోచరింపని కారణంగల కోపం మా యందు మీ హృదయంలో వున్నట్లు అనుమానింపవలసి వచ్చింది. లేకపోతే మీరట్టి అసంగతప్పని