పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గ్రహించడానికితగ్గ శక్తిలేక తప్పని అనడం యేలాగా తప్పదని దీనిలోకి దిగాను. యిదియిలా వుంచి పూర్వపువారి పాండిత్యాలకున్నూ యిప్పటి పాండిత్యాలకున్నూ హస్తిమశ కాంతరమనిన్నీ అప్పటి రాజాధిరాజులు పండితుల వాదోపవాదాలను వారి యుద్ధాలతో పాటు గౌరవించేవారనిన్నీ అందుకే మాపిఠాపురం రాజావారుకూడా గోపాలశాస్రుల్లు గారియొక్కానున్నూ సుబ్బయ్యశాస్రుల్లు గారియొక్కానున్నూ వాదోపవాదాలు వినడానికి సభచేసివున్నారనిన్నీ ముఖ్యంగా మనం తెలుసుకోవలసి వుంటుంది. ಅಲ್ಲಿ మహా రాజులేవుంటే “పిడివాదాలు” వాదించేవారిబండారం తేలుతుందిగాని పత్రికలవల్ల లేశమున్నూ తేలదు. మాఅదృష్టంమంచిదికనక శ్రీఆత్మకూరిలో వచ్చినవాదంలో

"దేవతలు ధర్మవర్తులు"

అన్న ప్రయోగాన్నిమేమిచ్చినప్పుడు "ధర్మవృత్తులు" అనిదిద్దుతామన్నవారి పిడివాదాన్ని సాగనీయని ప్రభువుండడం తటస్థించింది గాని- యిప్పుడు- "మనుజుల విప్రుండు" అన్న ప్రయోగాన్నిదిద్దుతామనే పిడివాదాన్ని మానిపించడానికి దగ్గ ప్రభు వేండీ? లేడుగదా? లేకేమి, రాజన్నారెడ్డన్నావకటే, యశముగాంచె యీ రెడ్జెయ్య ప్రభువు మాకిప్పుడు దిక్కుగా కనపడ్డాండు. యిది విషయాంతరం.

యింకా యీ పిఠాపురపు గంగాధర రామారావుగారికి సంబంధించిన గాథలు కొన్ని వున్నాయి. మరొకప్పడు వ్రాస్తాను. వెనుక వ్రాసిన సంగతులలో “జుట్ల" విషయమై కొంతసవరణను పెండ్యాల వెం| సు। శాస్రుల్లుగారు వుపపాదించి వున్నారు. కృతజ్ఞతను పత్రికాముఖమున తెల్పి వున్నాను. కృతజ్ఞతా ప్రకటనానంతరం తలవని తలంపుగా మద్రాసుకు వెళ్లడం తటస్థించింది. అక్కడ సదరు గంగాధర రామారావుగారికి దత్తత రీత్యా మనుమలున్నూవారిపేరిటవారున్నూనాతో చెప్పినారుగదా : మీరు సవతినాయనమ్మ గారిని గూర్చి వ్రాసిన విషయాన్ని తాము సవతితల్లిగారికి జరిగిందని విన్నా మన్నారు. అసలే జరగలేదని శాస్రులుగారు లిఖించి వున్నారు. మా గ్రామంలో వెలంవారు పలువురున్నారుగాని వారిలో నా కన్న వయస్సు మించినవారిప్పడు వక్కరున్నూ సజీవులుగాలేరు. నేను వ్రాసే సంగతులు శ్రీ మాతండ్రిగారి వల్లనేకాక మావూల్లోవుండే వెలము వృద్దులవల్లకూడా విని వున్నవి. మావూళ్లో జరిగిన "లక్ష-యేభైవేల” వాదమే కాదన్నారు శాస్రుల్లుగారు. దానికి ధుండిగారు చెప్పిన శ్రీరంగంలో సంగతిని వుదాహరణంగా చూపివున్నాను. అదిన్నీ సత్యమైవుండునుగాని మా గ్రామంలో మా వీథినే జరిగిన లక్ష-యేభైవేలు “విభూతిరుద్రాక్ష ధారణమున్నూ అసత్యం కాదేమో అని యిప్పటికిన్నీ నాకు సందేహం. కమ్మగృహస్టు విషయంకూడా శాస్రుల్లుగారు అన్యథాకరించివున్నారుగాని