పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

440

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


జూపించినట్లు దృఢనిశ్చయులై శాస్త్రులవారు- “పూర్వోత్తరవిరోధ మొదవకుండఁ; బలుక నేర్చుట బహుతపః ఫలముగాదె?" అని యుదాహరించి అట్టి తపఃఫలము లేని వేంకటశాస్త్రిగారు ఇట్టి గ్రంథరచనకు దిగరాదని తమ యాశయ మన్నట్లు తేల్చినారు. ఇట్లు తేల్చి- శాస్త్రులుగారు “ఈమూఁగురు జామాతల” అను కందపద్యమును, ఆప్రాంతమందలి వచనములను పరిశీలింపలేదేమో?" అని యొకవాక్యమువ్రాసి, "ద్వితీయ ముద్రణమునందైను జూడకపోవుట చాలయాశ్చర్యము" అని మిక్కిలిగా అక్కజపడినారు. అక్కజపడి యంతతోఁగూడ విరమింపనేలేదు; ఇంకను గొంతగ్రంథము పెంచి యీ పూర్వోత్తరవిరోధము కుదురదని తేల్చిరి. ఒకటిరెండు మాటలలోఁ దేల్పవలసిన యంశమున కింత గ్రంథము పెంచుటేలొకో యని నే నక్కజ పడుచున్నాను. విమర్శకులగు వోలేటి శాస్త్రులవారో? “ద్వితీయ ముద్రణమునందైనను జూడక పోవుట చాల యాశ్చర్యము" అని ముక్కుపై వ్రేలిడికొనుచున్నారు.

ఇది యిటులుండె, యీ నాటకము మొదట శ్రీచెలికాని లచ్చారావు గారు తమ యాజమాన్యమునఁ బ్రకటించు పత్రికయందు ప్రకటించుట కారంభించినారు. ప్రథమాంకము ముగియకుండఁగనే, తిరుపతిశాస్త్రిగారు స్వర్గతులైనారు. నన్ను నప్రయత్నముగ రప్పించి నాకు నెలకు 25 రు. చొ. గౌరవవేతన మేర్పఱచి బహూకరించి పిమ్మట దీనిని పూర్తిచేసి యీవలసినదని కోరిరి. నాకప్పటికిఁ జిరకాలమునాఁడే దేహమున - ముఖ్యముగా శిరస్సునందు- భ్రమణ మేర్పడియుంటచే కవిత్వరచనమన్న భీతి యుదయుంచినది. కాని శ్రీలచ్చారావుగారి సమ్మానము నన్ను వశీకృతుఁగాఁ జేసినది. "అర్ధస్య పురుషో దాసః"

ప్రసక్తానుప్రసక్తముగా నింత వ్రాసితినేకాని యిది ప్రస్తుతవిరోధ సమర్ధన కుపకరింపఁజేయు తలంపుతోఁ గాదు. సుబ్బారాయశాస్త్రులవారికి మాయందు దయలేకపోయినది గాని అదియే యున్నచో ఆయన కంత వ్యాసము వ్రాయవలసియే యుండదు. మేమిన్ని వాక్యములు వ్రాయవలసియునుండదు. దయ యనఁగా నెట్టిదందురా? ఇట్టిది. కష్టపడి రెండుముద్రణములు సుబ్బారాయశాస్త్రులవారు చిత్తగించే యున్నారుకదా! ఇటీవల షష్టిపూర్తిసందర్భములో మరల గ్రంథములన్నియు ముద్రింపఁబడిన వనికూడ శ్రీ సుబ్బారాయశాస్త్రులవారు వినియుండక పోరుగదా! అగుచో బందరు మినర్వాప్రెస్సు నందు ముద్రింపఁబడిన 1934 సంవత్సరపు ప్రతిని గూడ శాస్త్రులవారు చిత్తగించి యుండినచో, ఆ యీ బాధవారికి లేకయుండునుగదా! ఆప్రతిలో 66వ పుటలో నిటులు దిద్దఁబడియున్నది. -