పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీర్తి - అపకీర్తి

431



చ. అది గనుఁగొన్నమాత్ర విజయావనిపాలని దుర్నయంబు దు
    ర్మదులు పరాసుసైన్యములరాయిడి, దుష్టతురుష్క సైన్యరా
    డదయత, వెల్మశూరులనయాంచిత బాహుపరాక్రమస్ఫుర
    త్కదనము నొక్క పెట్టునను కన్నులఁగట్టినయట్లు వ్రేలెడిన్"

అని నుడివితిని, ఈ వ్రాఁత నాకు ఆ స్థలము చూచుటవలనఁ గల్గిన యభిప్రాయమును బట్టి వ్రాసినదేకాని, యొకరిని సంతోషపెట్టుటకుఁ గాదు. నాకొక నియమము కలదు.

ఉ. ఆవల నెవ్వఁడేని కవి యల్లిన పద్యములం బఠించుచో
    నీవిధమెల్ల నిశ్చయమ; యీ నుతికిన్ దగు నీతఁడంచు సం
    భావనగల్గఁగావలయు భావమటుల్ పొడగట్టకున్న నా
    దేవురుగొట్టు పద్దెముల దీవనలేమిటి కప్పరాట్ర్పభూ!

నా నియమము పై పద్యమువలనఁ దెలియఁగలదని యుదాహరించితిని. ఏకొంచెమో ఆధారములేని వ్రాఁతను వ్రాయుటకు, కవులెవ్వరును ఇష్టపడరు. అందులో చరిత్ర విషయమున బొత్తిగా నిష్టపడరు. ఏదో కొంచెమున్నచోఁ గొందఱు మిక్కిలి పెంచి వ్రాయుదురు. కొందఱు సామాన్యముగా పెంచి వ్రాయుదురు. బొబ్బిలికథవలెనే వేఱొకరు విజయ నగరపుకథ అనుపేరుతో నేలవ్రాయలేదో మనమాలోచించుకోవలెను. పేరేది పెట్టినను బొబ్బిలివారినే పైకెక్కింపవలయుననియే నేననుకొందును. కొన్నిలోపములున్నను తరువాతి కవులకు జంగముకథలోని యంశములే మార్గప్రదర్శకములైన వనుకొందును. ఈ రెండుసంస్థానములకును గలపూర్వవైర కారణములను గూడ నేఁటి నాటకగ్రంథకర్త లుదాహరించినను తుదకు బొబ్బిలివారి కుత్కర్షమును, వేఱొకరి కపకర్షమును వ్రాయకతప్పదు. కావున శ్రీశర్మగారి యీక్రింది వాక్యమునకు సమంజసమైన యర్ధము నాకు స్ఫురింపదయ్యె ఆవాక్యమిదియే

“పైనుదాహరించిన శాత్రవ బీజములను వినాయించి, ఉత్తరకథను కేవల వధాపూర్వకమైన దానిని నాటకముగారచించి ప్రదర్శించుట చారిత్రక సత్యము లేనిపనియనియు, నాటకలక్షణము తెలిసిన విబుధులాక్షేపింపఁదగిన పనియనియుఁగాఁ జెప్పవలెను.” మఱియు నాటకకర్తలకు "అన్యథావాప్రకల్పయేత్" అనునొక యాధారము కలదు. అది నాయకుని యందేదేని లోపమున్నచో బహుసుగుణములుగల నాయకుని యందలి యాస్వల్పలోపమును అన్యథాగామార్పుచేసి సవరించుట కుపకరించును. ప్రస్తుత మీ బొబ్బిలికథను నాటకమునకుఁ గైకొన్నకవి విజయనగర ప్రభువును ప్రధాన