పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

430

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కవులట్లు రచించిన చరిత్రములు లేకపోలేదు. గాని కొందఱు తమంతటఁదాము స్వతంత్రించి వ్రాసిన కవులు లేకపోలేదు. “ఘనమతు లెల్లవారికి నకారణబంధులుగారె! సత్కవుల్". భారతరామాయణాదులిట్టి రచనలే. ఆయాచరిత్రలలో నచ్చటచ్చట నతిశయోక్తి వర్ణనలున్నట్లే ప్రకృతకథయందును అయ్యవి లేకపోలేదు. కాని ప్రధానాంశమునందట్టిది లేదని యెల్లరును విశ్వసించిరి.

ప్రధానాంశమనఁగా, బొబ్బిలికిని, విజయనగరమునకును యుద్ధము జరిగినది. ఇందులకు కారణము తమకన్న మిన్నయు అప్పటి కాలములో మహారాజై తమవంటివారి ననేకులను సామంతులుగాఁ జేసుకొని యేలుచున్న విజయనగర ప్రభువును బొబ్బిలి లక్ష్యపెట్టకుంటయే. సదరు యుద్ధములో బొబ్బిలి నాశనమైనది. విజయనగరము గెల్చినది, కాని "అత్యుత్కటైః పుణ్యపాపైః" అనురీతిని మహారాజు తాండ్ర పాపయ్యగారిచే మడియుటచే విజయనగరపు విజయముకన్న బొబ్బిలి పరాజయమే కవి గేయమైనది అనునది. ప్రస్తుత నాటకములుగాని, వెనుకటి ప్రబంధములుగాని యీ ప్రధానాంశమును బురస్కరించుకొనియే బయలుదేరినవి. శ్రీ శర్మగారికింబలె విజయనగరము నెడల నాకు మిక్కిలి యభిమానము. ఈ విషయము - "అల పతంజలి కృతంబైన భాష్యమునకే పరిఢవిల్లును మహాభాష్యపదము" అను సీసములోని యంశముల వలననే లోకము గుఱితించును. పైఁగా నిన్న మొన్నఁ బ్రకటింపఁబడిన నాజాతకచర్యలో - "రాజనఁగ నాతఁడే, మంత్రిరాట్టనంగ నాతఁడే" అనుపద్యమును గూడ శ్రీ శర్మగారు తిలకింతురుగాక. ఇట్టి యభిమానముగల నానోటనే ఆమధ్య బొబ్బిలికి వెళ్లినప్పుడు చరిత్రకు సంబంధించిన విషయమును బురస్కరించుకొని “మII వెలమల్ రాజులకన్న మిన్నలను నవ్విఖ్యాతి కిందావుగా వెలసెన్ బొబ్బిలి" అని నుడువవలసి వచ్చినది. శర్మగారీ వ్రాఁత యెడల నెట్టి యభిప్రాయమిత్తురో! చూడవలెను. ఈ యుద్ధకాలము వఱకును వెలమవారు శూరులలో నొకరుగానున్నను, అగ్రేసరులని అందులో క్షత్రియుల కన్న మిన్నలనిపించుకొనుచున్నట్లు లేదు. ఈ విజయనగర ప్రభువే వారికీర్తికి వన్నెవెట్టినట్లు నాకుఁదోcచినది. నేను బొబ్బిలివారిచే సమ్మానింపఁ బడవలయునను కోరికతో నట్లువ్రాయలేదు. విజయనగరము వారును నన్ను సమ్మానించిరి. కావున చరిత్రమునుబట్టి నాకు స్ఫురించినట్లు వ్రాసితినేకాని, ప్రయోజనాపేక్షచేఁగాదని మనవి చేయుచున్నాను. మఱియు బొబ్బిలి పట్టాభిషేకము వ్రాయుచు, అందీయుద్ధప్రసక్తి రాఁగా-

ఉ. “... ... ... రాతికంబ మొకఁ డెత్తయినట్టిది చూడనయ్యెడిన్"