పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/425

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది429కీర్తి - అపకీర్తి

"పుణ్యైర్యశోలభ్యతే" అని యభియుక్తులు వచించినను, అంతకన్న కీర్తి సంపాదనకు ఋజువర్తనమే ముఖ్యమని నేననుకొందును. పుణ్యముపరంపరాకారణమైనఁ గావచ్చునుగాని సాక్షాత్కారము మాత్రముకాఁజాలదు. ఇందుల కెన్నియో యుదాహరణములు సుప్రసిద్ధములు కలవు. రావణుఁడెంత తపశ్శాలియైనను, పరాక్రమ సంపన్నుఁడైనను, ఋజువర్తనగల రామునికి వచ్చిన కీర్తి వానికిరాలేదు. ఇట్లే సుయోధనునికిని. ఇఁక ప్రస్తుతము యువ సం!! ఆషాఢమాస చంద్రికలో శ్రీయుత దువ్వూరి జగన్నాథశర్మగారు శ్రీ విజయనగర ప్రభువులచరిత్రను వ్రాయుచు బొబ్బిలి యుద్ధసందర్భమున అప్పటి శ్రీ విజయనగర ప్రభువొనర్చిన కార్యమును సమర్ధింప వలయునని కొంత ప్రయత్నించిరి. బొబ్బిలివారు వీరికాగ్రహమురాఁదగు చెడ్డపనులంతకుమున్నెన్నో చేసినట్లుదాహరించిరి. తుదకు తాండ్ర పాపయ్యగారు మహారాజును వధించుటను గూడ నుదాహరించి, అది యొక పౌరుషము గాదని వక్కాణించిరి. శ్రీ శర్మగారు వ్రాసిన ప్రతివాక్యమును నేను శిరసావహించువాఁడనే యైనను ఈ క్రింది మాటలు వ్రాయుచున్నాఁడను. శ్రీ మహారాజావారికిని, బొబ్బిలివారికిని ఎస్టేటు విషయముననేమి యితర విషయములయందేమి హస్తిమశకాంతరమన్నను కాదనువారుండరు. కాని యీ హెచ్చుతగ్గువల్లనే బొబ్బిలివారి కీర్తికి వన్నెయు, మహారాజావారి కీర్తికి కళంకమును విస్తరించుచున్నవి. ఎక్కుడు సేనయు రాజ్యమును గల శ్రీ మహారాజులుంగారు, ఫ్రెంచి సైన్యమును, పైగా తురుష్క సైన్యమును సాయముగాఁగొనుట, పిరికితనమునకు స్ఫోరకము. సమయము కాని సమయమున దండెత్తివచ్చుట కూడ డిటో, బొబ్బిలివారెన్ని విధముల సామోపాయము నవలంబించినను దానికి నంగీకరింపమి కూడ డిటో, బుస్సీ రక్షింపనెంచిన పసిబాలుని వధింపవలయునని నిర్ణయించుటయు డిటో, ఇంకను ఇట్టి హేతువులు బోలెడు కలవు. అన్నియు జగత్ప్ర సిద్ధములే. కాన విస్తరింపనక్కరలేదు. బొబ్బిలికథ వ్రాసిన యతఁడు బొబ్బిలివారివలన ధనముగొనిగాని వ్రాసియుండఁడు. మరల బొబ్బిలికి నామ రూపములు చాల వత్సరములకు పిమ్మటఁగాని రాలేదనుట చరిత్రప్రసిద్ధమే. ఈ కథయో! యుద్ధముజరిగిన కొలఁదినాళ్లలోనే అనఁగా - ఆవేఁడి చల్లాఱక పూర్వమే రచింపఁబడి యుండుననుట యుక్తియుక్తము. కావున నిది యొకరి ప్రేరణమునఁగాని, ధనముగొనిగాని రచింపఁబడి యుండదు. కొందఱు