పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/422

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

426మఱొక అపవాద

అంటే ఇదివఱలో, తి. వెం. కవులకు సాక్షాత్తుగా దేవీప్రత్యక్షంవుంది అనే అపవాదనుగూర్చి “ప్రౌఢభారతి"లో కొంత వ్రాసివున్నాను. యిప్పుడు వ్రాసేది మఱో అపవాదనుగూర్చి కనుక, శీర్షిక అలా పెట్టవలసి వచ్చింది.

మొల్ల అనే కవయిత్రి పే రెఱుఁగనివారంటూ తెలుఁగు దేశంలో లేరుకదా. ఏమూర్ఖఁడుగాని, యేపండితుఁడుగాని ఆపె కవయిత్రి కాదనిన్నీ ఆపె తండ్రో, సోదరులో లేక భర్తో కవిత్వం చెప్పి ఆపె పేరు పెట్టి ప్రకటించి వుందురనిన్నీ చెప్పినట్లెక్కడనూ విన్నవారున్నట్లున్నూ లేదు. యీ అపవాద దైవవశాత్తు నాకేవచ్చింది. యేలా వచ్చిందంటే, యిప్పుడు నాకు శనిమహాదశ జరుగుతూ వుంది. వాఁడు చేసేకార్యాలు చాలావున్నాయి. అందులో మొదటిది. “మిథ్యాపవాద” అన్నది. ప్రస్తుతం నాకు సంభవించినదిన్నీ అదేకనక, గ్రహచారంవల్లనే యీ అపవాద వచ్చిందంటే యుక్తి సహంగా వుంటుంది. మొల్ల తండ్రిగాని సోదరులుగాని, భర్తగాని కవులుగా వుంటే, వెం. శా. అట్టి వుద్దేశం పడ్డాఁడనడానికేనా వీలుగావుండేది. అట్టి ప్రతీతి యొక్కడనూ లేదుగదా! అట్టి స్థితిలో వెం. శా. అలా వుపన్యసించాఁడెక్కడో అనే లోకులవుద్దేశం యెట్టిదైవుండునో! యీ మొల్లసంగతే నిలిచేటట్టులేదుకదా? యిఁక దీన్ని వుపజీవకంగా చేసికొని ధ్వనింపచేశాఁడన్న అంశాన్ని గుఱించి విచారించడమెందుకు? “నిమిత్తాపాయేనైమిత్తిక ప్యాప్యపాయః" కదా! కాఁబట్టి దాన్ని గుఱించి వ్రాసి కథ పెంచేదిలేదు.

మొల్లనుగూర్చి నాకుఁగల వుద్దేశాన్ని బందరు హిందూ హైస్కూలులో నేను తెలుఁగుపండితుఁడుగా వుండేరోజుల్లో చదువుకున్న విద్యార్థులు పలువురెఱుఁగుదురు. నేను పండితుఁడుగావున్న పదమూడేండ్లలో రెండు సార్లుఁకాబోలును మొల్లరామాయణం స్కూలు ఫైనల్కుటెక్ట్సుగా పడ్డది. అప్పుడు సీత రావణాసురునితో గడ్డిపరక మధ్యగాపెట్టుకుని మాట్లాడే పద్యాలు పాఠం చెప్పేటప్పుడు నాకు వొళ్లు తెలిసేదేకాదు. మొల్ల సాక్షాత్తుగా తానే సీతాదేవి ననుకోవడంచేత ఆలాటి కవిత్వం చెప్పఁగలిగిందని విద్యార్థులతో అనేవాణ్ణి. సాటిఆఁడుదానికిఁ గల్గిన పరాభవాన్ని గుఱించి ఆండుది చెప్పిన కవిత్వంకనుకనే కవిత్వం అంతపాకంగా వుంది అనేవాణ్ణి. వాల్మీకంలోగాని, భాస్కరాదుల కవిత్వంలోగాని యీ