పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అపవాదలు

425


గాశీక్షేత్రములోని భంగుపానము విజయనగరమునకు సంపూర్తిగాఁ గాకున్నను జాలవఱ కలవడినది. అది మన ప్రస్తుతపుదివాన్‌జీవారికిని ముఖ్యమగుటచే, ఆయనసాయంకాలము సుమారు 5 1/2 గంటలవేళ దానిని పుచ్చుకొని షికారుకు బయలువెడలి రాత్రి సుమారు 11 గంటలప్రాంతమునఁగాని భోజనమునకు వచ్చువారు కారు. నేను గ్రహణీరోగ పీడితుఁడనై యంతవఱకు భోజనమున కాగుట యెంతచిక్కో ఆలోచింపుఁడు. అట్టి సంకటస్థితిలో వ్రాసిన యీ పద్యము మొట్టమొదటి యంశమునే పురస్కరించికొని పుట్టినదనుట యుక్తమగుటచే నట్లుయథార్థమును తెలిపితినేకాని, యిందలి యంశము లన్నియు నుపాదేయములే. ఆ యీ చిక్కులన్నియును గాకున్నఁగొన్నియేనియు నప్పుడప్పుడు పడియున్నకతముననే “పడవలెఁబడరానిపాటులెల్ల" అని నేను వ్రాయవలసి వచ్చినది. ఆ యీ చిక్కులన్నియు కవిత్వమున కుపకరించునవియే యని లాక్షణికులు వక్కాణించియే యున్నారు. “అహోభారో గురుఃకవే”.

దీనిని విస్తరించుట కిది చోటుగాదు. చిక్కులుపడి కవియైనవాఁడు పిదపఁ గొంతకాలము మిగులవలెను. అది యొక్కడనోగాని ఘటింపదు. ఘటించినచో నతని రచనకుఁబైచిక్కులు చక్కని పనిచేయును. అది యుటులుండె. మాకుc గాళిక ప్రత్యక్షమగుటగాని, తోడఁబల్కుటగాని లేదనునది వక్తవ్యాంశము. హృదయమందుండి పద్యములనో, శ్లోకములనో అవధానాదులలో పలికించు నందురా? అగుచో నెల్లర హృదయమునందును భగవంతుఁడుండి పల్కించుచునే యున్నాఁడు. ఇచ్చటనే యననేల? అందులో విశేషము లేదుగదా?

శ్లో. ఈశ్వరస్సర్వభూతానాం హృద్దే శే౽ర్జునతిష్ఠతి (భగవద్గీత)

ఉపాధ్యాయుఁడుగారి మొదటిప్రశ్నమునకు నా యెఱిఁగినంతలో ఆత్మవంచన లేకుండ నుత్తరమిచ్చితిని. వారే ఇంకొక ప్రశ్నమునుగూడ నడిగిరి. అది భగవద్గీతలోని యంశము. అర్జునుఁడు మొఱ్ఱో నేను యుద్ధముచేయనని వెనుదీయుచుండఁగా శ్రీకృష్ణభగవానుఁడు చేయకతప్పదని పురికొల్పవచ్చునా? అది దేవుఁడు చేయఁదగిన పనియేనా అనునది. ఇదివారికి స్వయముగాఁ దోcచిన శంకకాదనియు మతాంతరులు చేసిన ప్రశ్నమనియు వారేవ్రాసిరి. ఆమతాంతరులు భీమునిపట్నంలో నెవరైయుందురో? చెప్పకయే తెలిసెడిని. వారిలో నీప్రాంతములలో విశేషించి ప్రాజ్ఞులుండరు. "హావూపేడా మీరుహల్కికొంటారు" తెగలోవారుందురు. వారి ప్రశ్నలకు జవాబక్కఱలేదని యుపాధ్యాయులవారికి విన్నవించుకొనుచు నింతటితో ముగించుచున్నాఁడను.


★ ★ ★