పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తండ్రి శ్రీ హీరుడుగారికిన్నీ ఆయన బావమఱందికిన్నీ జరిగిన వాదోపవాదాలకు సంబంధించిన యితిహాసంవల్ల మనకు తెలుస్తుంది. దీనియందు పూర్వపురాజులకు యెంత ఆసక్తిన్నీ లేకపోతే

"పగులంగొట్టించి తుద్భట వివాదప్రాధి గౌడడిండిమభట్టు కంచుఢక్క"

అనే శ్రీనాథునిపద్యపాదం మనకు ఆదరపాత్ర మవుతుందా? శ్రీనాథుండు ఆంధ్రంలో గ్రంథాలు వ్రాసినప్పటికీ సంస్కృతంలో సామాన్యుఁడు కాడు. గౌడడిండిమభట్టు సంస్కృతంలో జయసూచకమైన కంచుఢక్కా రూపమైన బిరుదచిహ్నం కలవాడు. శ్రీనాథుండేమో కవి సార్వభౌమ బిరుదాంకితుండా యె. యీ రెండుచిహ్నాలున్నూ రజోగుణప్రధానాలే అవడంచేత వీరిద్దరికిన్నీ వాదంపడింది. శ్రీనాథుండు జయించాండు. ఢక్కా పగుల గొట్టించాడు. యిప్పటి నాగరికులే అయితే యెందుకీ పిచ్చివాదాలందురు. అందురేమిటి? అనేతీరతారు. ఫీజుపుచ్చుకుని స్వార్థంకాకుండా పరార్థం యెంతగానో పోట్లాడుకుంటూ కోర్టుల్లో బల్లలుగుద్దుతూ వుండేవారినో - యిప్పటివారు లేశమున్నూ యెత్తుకోరు. అది “ఉదరనిమిత్తం బహుకృతవేషం" కింద జమకట్టుకుంటారు. పండితులో కవులో పెట్టుకొనే వాదాలైతే వీరు పూర్తిగా యేవగించుకుంటారు. కొందరు యేవగించుకోవడంతో సరిపెట్టక తూలుమాటలుకూడా వ్రాస్తారు. అయితే యీ పండితులలో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు. యేవిషయమై వాదం ప్రారంభమయిందో దాన్నిగురించి మాత్రమే యుక్తులు వుపయోగించక, అతనికి వకకన్ను లేదనిన్నీ యితనికి స్నానంచేయడం చేతగాదనిన్నీ అతనికి బోదకాలు వుందనిన్నీ యేమేమో యెంచడం మొదలుపెడతారు. తక్కిన వేవేనా యెంచితే కొంతవరకు సహించవచ్చు నేమోకాని దైవకృతమైన అంగవైకల్యాదులను కూడా విద్యావివాదాల్లో యెత్తుకోవడం పరమాసహ్యం అనడానికి సందేహంలేదు. పూర్వం మహారాజసభలలో యీ వాదోపవాదాలు జరిగేవికనక యీలాటి అవ్యక్తప్రసంగానికి అవకాశం వుండేదికాదు. యిప్పడో? మహారాజులే చాలావఱకు తగ్గివున్నారు. ఉన్నవారిలో యే వకరిద్దరోతప్ప పండితగోష్టికి చెవియొగ్గేవారు కనపడరు. అన్నిటికీ ఆధారం పత్రికలున్నాయి. ఆ పత్రికలలో కొన్ని కొంత మంచీచెడ్డా విమర్శించి ప్రచురించేవి వున్నప్పటికీ యేదో మేటరుదొరికితేనే చాలు అనుకొనడంవుంది. అందుచే పండితులవాదాలు బొత్తిగా రసాభాసప్రకరణంలోకి దిగుతూ వున్నాయి.

అప్పటి రాజులను గూర్చిన్నీ పండితులను గూర్చిన్నీ గురుముఖతః విన్నమాటలలో జ్ఞాపకమున్నంతవరకు ooJo వ్యాసంలో యేకరు పెట్టివున్నాను. అప్పటికన్న ఇప్పడు విద్య సర్వతోముఖంగా వ్యాపించి వుందనడం సర్వానుభవ సిద్ధమే. కాని వక తేడావుంది.