422
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
లనేకులకుఁ గలుగవచ్చును. అవి వారి వారి భావనల ననుసరించియుండును. అంతమాత్రమున వారికాదేవత ప్రత్యక్షమని వారుగాని, లోకులుగాని తలఁచుట యుక్తిసహముకాదని నేననుకొందును. ఆయీ భావనలుగూడ భిన్నభిన్నములు. శైవులకొకమాదిరి, వైష్ణవుల కొకరీతి, శాక్తేయుల కొకతీరు, మహమ్మదీయులకొకఫక్కీ క్రైస్తవుల కొకఠేవ. అంతమాత్రమున దేవతలు ప్రత్యక్షమైనట్లు వారు కాని ఇతరులుగాని నిశ్చయించుకోరాదనియే నేననుకొందును. స్వప్నమనఁగా సామాన్యముగాదు. మనుజుఁడు నిజముగా సుఖమునుగాని, దుఃఖమును గాని యనుభవింపవలసినచో స్వప్నమందే యనుభవింపవలయునుగాని జాగ్రదవస్థలో నేమున్నది. పుట్టమట్టి, వేదాంతశాస్త్రమంతయు స్వప్నమునే యాలంబించియున్నది. అదియటులుండె. నాకొకప్పుడు నూజివీటిలో నుండఁగా స్వప్నమున శ్రీకాళికావిగ్రహము పొడకట్టినది. ఆపెమోకాళ్లు పెద్దతాటియంత ప్రమాణముగ నున్నవన్నచో శిరస్సెంతవఱకుండునో వ్రాయనక్కఱలేదుగదా! ప్రత్యక్షమైనచోటొక మహారణ్యము. సమయము తెల్లతెల్లవారుతఱి. నేను భయసంభ్రమములతో గద్గదస్వరమునఁ గొన్ని పద్యములుకూడ నప్పుడు చెప్పుచు నామహాదేవి పాదములపైఁబడి నుతించితిని. కాని యీ పద్యములు మేల్కొన్నపిమ్మట జ్ఞప్తికిఁదగులవయ్యె మోకాళ్లు మునుఁగువఱకును పూజకుసంబంధించిన పుష్పములును, కుంకుమయును రాశిపడియున్నది. అట్లు పద్యములతో నుతించునావీఁపుమీఁద నాదేవి తన చేతితో నిమిరి “వాఁడేcడిరా" అని, తిరుపతిశాస్త్రిని గూర్చియడిగినది. ఈమాటకేమి బదులు చెప్పితినో యిపుడుజ్ఞాపకములేదు. ఇంతవిలక్షణముగాఁగాకున్నను, చాలసారులిట్లే జరిగినది. ఇంతమాత్రమున దీనింబట్టి ప్రత్యక్షమైనదని యెవరను కొందురు? కాని యొకటి మాత్రమున్నది. ఇట్టి సంగతి జరిగిన కొలఁది కాలమున కేదో మంచి కలుగుట మాత్రము కలదు. ఇందులకు స్వప్నశాస్త్రజ్ఞు లంగీకరింతురు. ఈ నూజివీటి ప్రత్యక్షగాథ జరిగిన మఱునాఁడే నేను బందరు హైస్కూలు పండితుఁడనుగా నాహూతుఁడనై వెళ్లవలసి వచ్చినది. అక్కడనే గ్రంథ రచనాదులవలన నాకు విశేషించి మంచి కల్గినది. ఇంతమాత్రమున నాకు శ్రీకాళికాదేవి ప్రత్యక్షమని లోకుల ప్రవాదముతో బాటు నేనుగూడఁ జెప్పికొన మొదలిడినచో నెందఱకో యెన్నో చిక్కులు దీర్పవలసివచ్చును. అది చేతఁగాదుగదా? చదువని శాస్త్రము చదివినట్లు ప్రచురించు కొన్నవారు పాఠముచెప్పలేక పరాభూతులైనట్లే నేనును గావలసివచ్చును. కాన లోకులభిమానతిశయముచే నాయం దాపాదించు మహత్త్వమును నేనపవాదమునుగాఁ బరిగణించి యిందుమూలమునఁ దొలఁగించుకొను చున్నాఁడను. నేఁటికి సుమారు 16 యేండ్లనాఁడొక బ్రాహ్మణుఁడు నాయొద్దకువచ్చి, తాను కొన్ని వత్సరములనుండి దేవినుపాసించుచున్నట్లును, ఆయుపాసనకు సంబంధించిన సంతర్పణలక్రిందఁదనకుఁగల భూవసతి యావత్తును గడతేఱినట్లు, చెప్పి ప్రస్తుతము మిగిలినది కడుస్వల్పమనియు,