పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/414

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

418

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


"మాకునెట్టి దుష్కరమగు కార్యమేని కొనసాఁగఁజేసెడి తల్లి
 కాళియున్| బరమకృపారసంబు పయిపై వెదఁజల్లి యనుగ్రహింపదే"

అని నొడువుటంబట్టియేమి మఱికొన్ని పద్యములవలననేమి మీఁకు జెప్పిన పెద్దలకు-

“తిరుపతి వేంకటకవులకు శ్రీకాళీమహాదేవి తోడఁబల్కును”

అను నపోహ జనించియుండును. అహంకార నిరాసార్థము మనలో ననేకులు పెద్దలట్లు స్వకీయప్రజ్ఞా విశేషములను భగవంతునియం దాపాదించుట కలదు. శ్రీపోతరాజుగారు-

“క. పలికెడిది భాగవతమఁట! పలికించెడువాఁడు రామభద్రుండట!" అన్నారు. ఇట్లే పలువురు పలికిరి. మేమును అట్లే అనునది ముఖ్యాంశము. ఇంతమాత్రముచే మేము భగవద్భక్తిలేనివారమని కానీ, నాస్తికులమనికాని మీరుగానీ, లోకులుగాని భావింపకుందురు గాక. మనుష్యుడు నిమిత్తమాత్రుఁడనియు సర్వమునకు భగవంతుఁడే కర్తయనియుఁ జెప్పెడి సిద్ధాంతమును మేము శిరసావహించువారిలోఁ జేరినవారమే. కాని మాకు శ్రీకాళీమహాదేవి ప్రత్యక్షమను నపవాదమును మాత్రము మేము మోయఁజాలము. అసత్యమైనను మంచిదేకదాయని సంతసించి మిన్నకుందుమేని పిమ్మటఁ గొన్నిచిక్కులు కలుగవచ్చును. మొదటినుండి మముమంత్రోపదేశమునకుఁగా నాశ్రయించి పీడించువారితో ఒట్లు, సత్యములు పెట్టుకొని, మేము మంత్రశాస్త్రవేత్తలము కామని యెంత మొఱ్ఱవెట్టి చెప్పినను వారువిశ్వసింపక యీప్రవాదమును వ్యాపింపఁజేయుచు నుండెడివారు. ఒకపరి శ్రీఆత్మకూరు సంస్థానపు వివాదాల సందర్భములో, ఆగ్రామమున చలిజ్వరబాధ విశేషించి యున్నది. దానిబారిని రాజుగారుమొద లెల్లరును బడియేయుండిరి. మాకు, ప్రతికక్షియగు శ్రీ శ్రీనివాసాచార్యులుగారును దానిబారిఁబడి యంతంబోక రక్తగ్రహణిచేఁ బీడితులగు సమయమున ఆయనకే తోఁచినదో? లేక యెవరేని బోధించిరో? నిజము భగవంతున కెఱుక ఈరక్తస్రావమునకు కారకులు శతావధానులని యొకపుకారుపుట్టించి దాని నివారణకుఁగా నెక్కడనుండియో శాబరతంత్రజ్ఞులంబిలిపించి యేమేమో చేయించుసందర్భ మెట్లో శ్రీరాజావారికిఁ దెలిసి వారిట్లు మందలించిరి. “మీరు వ్యాధినివారణ కౌషధసేవ చేయుటకు బదులు నిరుపయోగమగుపని చేయుచున్నారు. శతావధానులకు మీరనుకొన్న ప్రజ్ఞ లేకపోలేదు, ఏప్రజ్ఞయు లేకున్నచో, ఇంతదూరమువచ్చి ఇక్కడవారికన్న నెక్కుడుగా సంస్థానపండితులతో ఢీకొని పోట్లాడగలరా? అగుచో "మా మీఁద వారి శక్తి నెందుకు ప్రయోగించలే” దందురేని, ఇక్కడ మాకు గ్రంథము కృతి యిచ్చి మా వల్ల వృత్తి (అగ్రహారము) కూడ స్వీకరించి మాకు ముఖ్యులైన మీ పట్ల దాని నుపయోగించునెడల మా మీఁద గూడ నుపయోగింపవలసినదే."