పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/411

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీలాపనిందలు

415


తాత్పర్యం కలది కాకపోయినా తుదకి కళంకాన్ని ఆపాదించేదిగా పరిణమించినప్పుడు “ఇది యుక్తమేనా? మీకు” అని నిర్మొగమాటంగా అడిగి యికముందేనా యిట్టి "నీలాపనిందలు" ప్రచారం చేసి లోకపరితాపానికి కారకులు కాకుండా వుండడానికి తగ్గ వుపాయం చేయకపోవడం లోకులతప్పుగా నాకు తోస్తూ వుంది. యిట్టి కుకల్పనల విషయంలో వారు పెద్దలనిగాని, కవులనిగాని ఆలోచించి వూరుకోవలసివుండదు. “శ్లో, యుక్తియుక్తం వచో గ్రాహ్యంబాలాదపి సుభాషితమ్, వచనం తత్తునగ్రాహ్య మయుక్తంతు బృహస్పతేః".

బాగా ఆలోచిస్తే లోకం ఆలాటివ్యక్తులని మందలించవలసి వుంటుందనడంకంటే యే కాలకర్మదోషంవల్లనో ఆలాటి కుకల్పన చేయడం తటస్థించినప్పటికీ, అడుగునబడివున్న తమ ప్రాజ్ఞతను బయటికి తెచ్చుకొని పశ్చాత్తాపపడి, ఆపశ్చాత్తాపాన్ని స్వయంగా లోకానికి తెల్పడంలోనే విశేషంవుంది. కాని బుద్ధిపూర్వకంగా చేయాలని చేసినపనికి ఆలాటి సుయోగం యేలా సంఘటిస్తుంది? యిట్టి అయుక్తకార్యాలుచేసే వ్యక్తులు వసించే దేశానికి చిక్కు కలుగుతూ వున్నట్టు యీమధ్య వొకానొక సందర్భంలో గోచరించింది. బంగాళాదేశంలో మహాత్ముణ్ణిగూర్చి చేసిన (చెప్పు విసరడం) అపచారానికి బాధ్యత ఆదేశంలోనేకాక భరతఖండంలో సర్వత్రా పేరుమోసి వున్న శ్రీబోసుమీదికి రావడం పత్రికా పాఠకులందఱూ యెఱిగిందే కనక విస్తరించవలసి వుండదు. చతుస్సముద్రాలు వుండగా దక్షిణ సముద్రానికే బంధనం తటస్థం కావడమనేది ఆ సమీపంలో రావణాసురుడు వుండడంవల్లనే అని వొక కవి చమత్కరించి వున్నాడు. సర్వథా దుస్సహవాసంవల్ల ప్రాణికోట్లకే కాదు, జడపదార్థాలకు కూడా కీడు మూడడం సర్వానుభవసిద్ధం కనుక యీ విషయం జాగ్రత్తగా గమనించవలసి వుంటుంది. యిప్పటికాలానికిన్నీ పూర్వకాలానికిన్నీ భేదం వుంటుందని విశ్వసిస్తే తప్ప, ఆకాలమూ యీ కాలంవంటిదే అయేయెడల, ఆనాటి చరిత్రలలో యే భాగం సత్యమో, యేభాగం సత్యేతరమో? నిర్ణయించడానికి మానవమాత్రుడు సమర్దుడుకాడు. జ్ఞానదృష్టి కలవారు అనగా అతీంద్రియజ్ఞానవిధులే? ఆయాగాథలయందు వుండే యథార్థ్యాన్ని నిర్ణయించతగ్గవారు. వ్యాసాదులు అట్టివారనే కారణంచేతనే భారతాదికం మనకు విశ్వాస్య మవుతూవుంది. లోకంలో “సత్యకాలం" అనే పదం వాడుకలోవుంది. కాని అది యెప్పుడు అమల్లో వుండేదో? సరిగా చెప్పలేము, క్రమంగా సత్యానికి దుర్దశ వచ్చివుంటుందిగాని అమాంతంగా ఒకటేసారి వచ్చి వుండదు. కొంతకాలం యీ దుర్దశ పామరజనంలో అక్కడక్కడ దృశ్యాదృశ్యంగా వుండి క్రమంగా అంటువ్యాధిలాగ అలుముకొని తరవాతతరవాత యిది పండితులనుకూడా ఆశ్రయించింది. పండితులనగా “యిది మంచీ యిది చెడ్డా" అనే వివేకం కలవారుకదా? అట్టివారిక్కూడా యిదేం కర్మమని అనుకోవడానికి