పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/410

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

414

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యే గ్రంథములోనూ కనపడ్డట్టులేదు. యీ విరుద్ధ కల్పనలతో గ్రంథాన్ని లేవదీసినవారెవరో తెలుసుకుందామంటే ఆధారం కనపడదు. పేరు పెట్టుకోనేలేదు. మామా చరిత్రలలో గీరతానికి యీలాటిపీడ, ఆరోజులలో దాపరించినట్లు లేదుగాని, గుంటూరి సీమకు దాపరించింది. వాళ్లు “యథార్థవాది" - "సత్యవాది" యిత్యాది పేళ్లతో అసత్యాలు ప్రకటించడం వుండేది. ఆ “నీలాపనిందలు" మఱికొందఱు ప్రాజ్ఞుల వుత్తరాలద్వారా సమసిపోయేవి. ముప్పైయేళ్లు దాటిన తరవాత ఆయీ గాథలను బుద్ధిపూర్వకంగా అపవదించడానికి ఆరంభించారు. కొందరు. వీరి “నీలాపనిందలు" చూస్తే ఆశ్చర్యంగా కనపడతాయి.

పూర్వం మనదేశంలో నీలిమందు తయారయ్యే రోజుల్లో ఆమందు గూనలుదిగడానికి యీలాటివార్తలుచేయడం వుండేదంటూ వినడం. ఆమందు తయారు కావడానికిన్నీ యీ అపవాదాలకీ వున్న కార్యకారణభావం యేలాటిదో? నాకు బాగా తెలియదు. ఆయీసందర్భాన్నిబట్టి యెవరేనా అబద్ధపు వార్తలు వ్యాపింప జేసినప్పుడు వాట్లతత్త్వం తెలిశాక వాట్లను “నీలివార్తలు” అనడంమాత్రం అందఱికి తెలుసును. యీ నీలి వార్తలే, నానాటికి “నీలాపనిందలు"గా వ్యాప్తిలోకి వచ్చాయి.

యిందులో నానా విధకల్పనలు వుంటాయి. కల్పనలు యేలాటివైనా పేరుమాత్రం వొకటే. వీట్లకి కాస్త నామరూపాలున్నవాళ్లే విశేషించి గుఱి అవుతూ వుంటారు. యెవళ్లు కల్పిస్తారు, ముఖ్యంగా అది యేనాల్గురోజులో లోకంలో కొంత వ్యాపించి కొందఱికి పరితాపాన్ని కలిగిస్తుంది. అంతట్లో మళ్లా యథార్థవార్త తెలిసి ఆపరితాపం వారికి తగ్గుతుంది. యెవరిమీద కల్పితమవుతుందో, ఆదుర్వార్త వారికి “పీడా పరిహారం", అయిందని చెప్పి సంతోషించడంకూడా జరుగుతుంది. అసలువాళ్లు యెవశ్లో చేసినపని తప్పుపనే అయినప్పటికీ దాన్ని మంచిపనిగానే జమకట్టి సరిపెట్టుకోవడం సర్వత్రా లోకంలో ఆచారంగా వుంది గాని యీ అపనిందను వేసినవ్యక్తి యెవడో వాడు "ఫలానా" అని తెలియడమంటూవస్తే లోకం ఆవ్యక్తిని సుఖసుఖాల క్షమించడమంటూ వుండదని వ్రాయనక్కరలేదు. వూరూ పేరూ తెలియకుండా బయలుదేఱే వాట్ల విషయమే బయటికివస్తే, సుఖసుఖాల క్షమింపరానిదిగా వుండేటప్పుడు వూరూ పేరూ కనబడేటట్టుగానే కొందఱు అపవాదలు ప్రచురించడంచూస్తే, చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. యీ విషయంలో సజీవులకి సంబంధించినవి కొంత క్షంతవ్యాలే అనుకున్నా కీర్తిశేషులకు సంబంధించినవి బొత్తిగా క్షంతవ్యాలు కావు. ఆలాటివాట్లనుగూర్చి లోకం కలిగించుకోవడం ఆవశ్యకమయినా, కలిగించుకొన్నట్టు కనపడదు. అపవాదకుల వుద్దేశం కీర్తిశేషుడికి కళంకాన్ని ఆపాదించే