పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

408

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“సర్వా వెంకటశేషయ్య యమ్. యే." యితనికి యిట్టి ప్రయోగబాధ తటస్థించడమూ, యింకా నివర్తించకపోవడమూ గత సంవత్సరమే బందరులో విన్నాను. మంత్రశాస్త్రాన్ని విశ్వసించేవారికి యివి విశ్వసనీయాలే. భారత యుద్ధాలు, రామాయణం యివన్నీ మంత్రశాస్త్ర విశ్వాసంతో సంబంధించివుంటాయి. నిన్న మొన్నటిదాకా పూర్వపు యుద్ధాలలో వుండే ఆశ్చర్యాలనుగూర్చి మనం చాలావఱకు కవుల కల్పనకింద తోసేయడం జరిగేవి యిటీవల యూరపుఖండ యుద్ధాలలో ప్రత్యక్షంగా జరుగుతూవున్న ఆశ్చర్యాలు కాదనడానికి వల్లకాక పోవడంచేత పూర్వపు వాట్లకుకూడా కొంత యోగ్యత కలిగింది. యిప్పటిదానికిన్నీ అప్పటిదానికిన్నీ వున్న భేదం యెంతోలేదు. అదంతా మంత్రబలమని వాళ్లు వ్రాశారు; కాదు "యంత్రబలమే" అని యిప్పటివాళ్లు ఋజువు చేస్తూన్నారు. యంత్ర బలం గొప్పదా? మంత్రబలం గొప్పదా? అని మనం విచారిస్తే మంత్రబలమే యెక్కువదిగా తేలుతుంది. మంత్రబలంచేత సాధించిన కార్యాన్ని మనం యంత్రబలంచేత సాధించగలిగినా, దానికున్నంత అమోఘత్వం దీనికి వుండదు. ప్రస్తుతం యీ విషయం విచార్యం కాదు.

యిప్పుడుకూడా "చేతబళ్లు" వున్నట్లు కొన్ని ప్రమాణాలు కనబడుతూనే వున్నాయని వ్రాసే వున్నాను. యివి తుచ్ఛదేవతోపాసనలవల్ల సాధించేవనిన్నీ మహామంత్రోపాసకులు పరమార్థదృష్టితో వుపాసన చేస్తారే కాని యిట్టి తుచ్ఛఫలాన్ని అపేక్షించి తపస్సు వ్యర్థపఱచరనిన్నీ అందఱూ చెప్పుకొనే విషయమే. కీ.శే. నడివింటి మంగళేశ్వరశాస్త్రుల్లు గారికి సంబంధించిన చరిత్రలో యీ మంత్రశాస్త్ర విషయం చాలా ప్రధానంగా వుంటుంది. యేదో సంస్థానంలో రాజుగారు వీరిని "అయ్యా! మీరు "శివో౽హం, శివో౽హం” అంటూ వుంటారు కదా? పార్వతీదేవి మీకు భార్యే అవుతుందా?” అంటూ ప్రశ్నించేటప్పటికి శాస్త్రుల్లుగారు అప్పటికి వూరుకొని, రాజుగారి తల్లికి ఆబ్దికము నాడు వెళ్లి కూర్చుని, (తమకు అక్కడికి వెళ్లవలసిన ప్రసక్తితో సంబంధంలేక పోయినా) శాస్త్రులుగారు రాజుగారు చేసిన శంకవంటివే కొన్ని నిర్మొగమాటంగా, నిర్భయంగా చేసేటప్పటికి, ఆ శంకలు శుద్ధాంతానిక్కూడా అవమానకరమైనవిగా వుండడంచేత శౌర్యం పట్టజాలక “చూస్తారేం పట్టుకోండి" అని నౌకర్లను హెచ్చరించేటప్పటికి నౌకర్లు శాస్త్రుల్లుగారిని పట్టుకోవడానికి దగ్గిఱకు రాబోయేటప్పటికి ఆయనవద్ద సిద్ధంగానే వున్నవిభూతిని వాళ్లమీదకి వూదేటప్పటికి వాళ్లు “కుయ్యో, మొఱ్ఱో" అని పాఱిపోవలసి వచ్చిందనిన్నీ తరవాత రాజుగారుకూడా స్వయంగా ప్రయత్నించి చూచారుగాని కృతార్థులు కాలేక లజ్జింపవలసి వచ్చిందనిన్నీ చెప్పుకుంటారు. ఆ యీ గాథలు యించుమించు 60 లేక 70 యేండ్లనాటివికాని, యుగాంతరాలనాటివి కావు. నిన్నమొన్న వొకానొక శాస్త్రుల్లుగారిని (వీరు పల్నాటి తాలూకా వారు) గూర్చిన మంత్రశాస్త్ర ప్రసక్తి అత్యాశ్చర్యకరమైనది చదివాను త్రిలింగపత్రికలో,