పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీలాపనిందలు

407


ఆలా నిరూపించినట్లు యీ వేదవిద్వాంసుల అమాయిక ప్రసంగం సాక్ష్యమిచ్చింది. దీన్ని యథార్థాన్ని చెప్పి పోగొట్టుకుందామంటే శక్యమౌతుందా? ప్రయత్నించినకొద్దీ మఱింత బలపడుతుంది. అయితే యిదికల్పించినవారికి మాయందేమేనా ద్వేషంవుండివుండునా? ద్వేషంలేదు సరిగదా, పైగా అంతో యింతో, అనుగ్రహమే వుండివుంటుంది. అందుచేత యీ “నీలాపనింద" అనుగ్రాహకులద్వారాగానే కల్పితమయిందనుకోవాలి. యిది జరిగిన మఱుచటి సంవత్సరమే ఆత్మకూరు సంస్థానంలో పండితులకూ మాకూ కొంత విద్యావివాదం జరిగింది. అందులో వుండగా ఆ సంస్థాన పండితులలో ప్రధాన పండితుడికి “గ్రహణి" వ్యాధి ప్రారంభించి చాలా చిక్కు పెట్టింది. అప్పడు వారు దాన్ని “చేతబడి"గా భావించి దానికి ప్రతిక్రియలు చేయడానికి పెద్ద అట్టహాసం చేయడం రాజుగారికి తెలిసి "తగిన వైద్యం చేయించుకోండి, “చేతబళ్లు" వుంటే వుండనివ్వండిగాని ప్రస్తుతం ఆలాటి అనుమానంతో లేశమున్నూ అవసరంలేదు.” అంటూ నివారించాడు. ఆ పండితులు ఆ దోషం మామీద ఆపాదించాలని బుద్ధిపూర్వకంగా పన్నిన పన్నుగడే కాని నిజంగా ఆ గ్రహణివ్యాధి మేము వారికి "చేతబడి" ద్వారాగా పంపిందని వారు విశ్వసించి వుండరని మే మనుకున్నాం. యిప్పడంతగా లేదుగాని పూర్వకాలంలో కాస్త కుంకుమబొట్టు పెట్టేవాళ్లకల్లా యీ అపవాద వుండేది. నిన్న మొన్నటిదాకా జీవించి వున్న “పాలంకి రమణయ్య" గారికే కాక యిప్పుడింకా సజీవురాలై వున్న ఆయన భార్యకుకూడా యీ "చేతబడి" విద్యలో చాలా ప్రవేశమని దానికి సంబంధించిన చాలా గాథలు చెప్పకోవడం వుంది. విస్తరభీతిచేత ఆగాథలు వుదాహరించలేదు.

పండితులకూ కవులకూ యీ అపనింద అంతగా లేదుగాని పగటి వేషాలవారికీ, భాగోతులకూ విశేషించి వుంది. యేదో గింజలు నోటిలో వేసుకొని సభలో యేమీ యెఱుగనివాడిలాగ కూర్చుని ఆ గింజలు పటుక్కున కొటికేటప్పటికల్లా మద్దిలి పగిలిపోయిందనిన్నీ భాంవేషగత్తె విరుచుకు పడిపోయిందనిన్నీ తరవాత యీ సంగతి కనిపెట్టి ఆ భాగోతుల్లోనే మఱొకడు (యీ చేతబడి విద్యలో ప్రవేశం కలవాడు) యేదో విభూతి మంత్రించి హ్రాం హ్రీం హ్రూం అని ఆ చేతబడి తిప్పిన తరవాత భాగోతం సక్రమంగా నెఱవేఱిందట! గాని తెల్లవాఱిన తరవాత భాగోతం చూడడానికి వచ్చిన జనమంతా యెవళ్ళిళ్లకువాళ్లు వెళ్లడం జరిగాక మొట్టమొదట చేతబడి చేసిన పురుషుడు అక్కడే కదలక మెదలక ఆగిపోవలసి వచ్చిందనిన్నీ దానిక్కారణం భాగోతులు తమమీద కొట్టిన దెబ్బను (చేత బడినన్న మాట) తప్పించుకొని మళ్లా కొట్టడ మనిన్నీ వినడం. నాబాల్యం నాటికి బాగా యిలాటివి చెప్పుకోవడం వుండేది. అంతకాకపోయినా యిప్పుడు కూడా యీలాటి సందర్భాలు వింటూనే వున్నాము.