పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అనే శీర్షికతో ఒక గద్యపుస్తకం వెలువడింది. కాని, అందులో వున్న విషయం ప్రస్తుతవిషయాన్ని బోధించేదిగా వున్నట్టులేదు దాని కాపేరు యెందుకు పెట్టవలసివచ్చిందో? అని ఆరోజుల్లో నాలో నేను అనుకున్నట్లుకూడా జ్ఞాపకం వుంది. నైజాం సంస్థానాలు చూచే రోజుల్లో వొక విద్వత్కవి మేం వెళ్లినప్పుడే అక్కడికి వచ్చాడు. యేదో సంస్థాన పండితులు పరీక్ష చేసేటప్పుడు మాతో ఆయనకూడా కూర్చున్నాడుగాని నాడు ఆయనకు దైవాత్తూ జ్వరం తగలడంచేత యేమీ వ్రాయలేదు. ఆయేడు ఆలా గడిచిపోయింది. మఱుచటివత్సరం అవధానసభ యేర్పాటుచేశారు. ఆయనకి ఆవేళ యేకాదశి. వుపవాసంతోటే ఆయన శతావధానాని కంటూ పృచ్ఛక ప్రశ్నలను వింటూ ప్రథమచరణం చెప్పడానికి మొదలు పెట్టారు. 25 మందికి 25 చరణాలు మొదటివి చెప్పిన అంతట్లో ఆయనకి యేం తోచిందో? మెడకు పైమీద కండువా చుట్టుబెట్టుకొని సభకు సాష్టాంగపడి “అయ్యా! నాకు యీ వేళ యేమీ స్ఫురించడంలేదు కనక క్షమించండి; మఱొవొకప్పుడు సభ చేస్తే అప్పుడు చేస్తాను అవధానం" అని చెప్పేటప్పటికి రాజుగారున్నూ సభ్యులున్నూ, ఏకాదశీ ఉపవాసం దీనికి కొంత కారణమై వుంటుందని అనుకున్నారు గాని అంతకంటే యేమీ అనుకున్నట్లే లేదు. వెళ్లిపోయింది. యిది జరిగిన సంవత్సరం మన్మథ.

మఱి యేడెనిమిదేళ్లకు అనగా శోభకృత్సంవత్సరంలో నేను యేలూరులో సోమంచి భీమశంకరంగారికి, అతిథిగా వున్నప్పుడు ఆ నైజాం దేశీయులు యిద్దఱు బ్రాహ్మణులు నేత్రావధానంచేశేవారు వేద విద్వాంసులు సంచారార్థం వచ్చారు. సంపన్న గృహస్థులను చూచారు. వారికి కన్యకాపరమేశ్వరి ఆలయంలోనే అనుకుంటాను సభ యేర్పాటయింది. సభాదినంనాడు వారు నా బసలోకి నన్ను చూచే నిమిత్తం వచ్చి యేదో పిచ్చాపాటీ మాట్లాడుకోవడం జరిగిన తరువాత లోగడ గద్వాలలో సభకు సంబంధించిన వృత్తాంతాన్ని యెత్తుకొని "నాడు తమ అనుగ్రహాన్ని ఆయన కోరకపోవడంచేత ఆలా జరిగింది. అందుకోసమని తమదర్శనానికి వచ్చి ఆజ్ఞపొంది వెడదామని వచ్చా" మని మెల్లిగా చెప్పడానికి మొదలు పెట్టేటప్పటికి నిర్ఘాంతపడ్డాను. అప్పటిదాకా నాటి “ఏకాదశీ ఉపవాసపు సభావృత్తాంతం" యిలా పరిణమించిందని సుతరామూ నే నెఱుగను. మనదేశంకంటే ఆదేశం యీలాటి విశ్వాసం విషయంలో చాలా అగ్రగణ్యంగా వుంటుంది. అనేక గాథలు పూర్వపండితుల వాదోపవాదాలకు సంబంధించినవి యీలాంటివి విద్వత్పరంపర చెప్పుకొనేవిలేకపోలేదు. పోనీ, ఆయనకిన్నీ మాకూనున్నూ యేమేనా వాదోపవాదాలేనా జరిగాయేమో? అంటే అదిన్నీ లేదు. యిల్లా వున్న సంబంధం ఉభయులమూ కవులమవడం తప్పయితరంలేదు. యెవరు కల్పించారో మహాప్రబుద్దులు ఆయన నాడు అవధానం చేయడానికి ఆరంభించి మధ్యలో విరమించడానికి మమ్మల్ని కారణంగా నిరూపించారు.