పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



405


నీలాపనిందలు

ఈ శబ్దం సాధువైనా కాకపోయినా నిర్హేతుకంగా ఆపాదించే అపవాదలను యీ శబ్దంతోనే పండితులూ, పామరులూ వాడతారు. దీన్ని దిద్దేయెడల నిరపనిందలు అని దిద్దవలసివస్తుంది. యెన్నో శబ్దాలు యీలా మాఱిపోయిన వున్నాయి. యీ శబ్దం యెంతో అపభ్రంశంగా మాఱికూడా సంస్కృతశబ్దమేమో? అనే భ్రమను కలిగిస్తూవుంది. నీలా + అపనింద = నీలాపనింద అన్న వ్యుత్పత్తి చెప్పి వొకప్పుడు వొక పద్యంకూడా చాలా కాలం క్రిందట చెప్పబడింది --

"నీలాపనింద యనఁగా, భూలోకమునం దబద్ధపుం బలుకగు నీ,
  నీలాపనింద ప్రకృతము, నీలవలనఁ గలుగుకతన నిజమై తోcచెన్"

ప్రస్తుతం మనక్కావలసింది నిర్హేతుకాపవాదలకు లోకంలో యీ పదం పర్యాయ పదంగా అందఱూ వాడుకుంటూ వున్నారన్నది. యీ అపవాదలువేసే జనులు కొందఱు ప్రతీకాలంలోనూ వుంటారన్నందుకు త్రేతాయుగంనాటి వొక చాకలాయన మనకు వుద్బోధకుడుగా కనబడతాడు. కాని సవిమర్శంగా ఆలోచిస్తే ఆ రజకుడు సీతాపాతివ్రత్యం దురుద్దేశంతో అపవదించినట్టు కనపడదు. యేమంటారా? రాములవారియందుగాని, సీతామహాదేవియందుగాని వాడికియేవిధమైన దురుద్దేశమున్నూ వుందని ఎవ్వరూ యింతవఱకు చెప్పగా యెవరేనా విన్నారా? లేదు, నిజానికి వాడు. "తెల్లని వెల్లా పాలూ, నల్లని వెల్లా నీళ్లు" అనుకొనే వాళ్లల్లోవాడు, పెళ్లామేమో తన యిల్లు విడిచి అన్యత్ర వుండడమే దోషంగా వానిక్కనబడ్డది, ఆ పట్టాన్ని "వెఱ్ఱి రాముణ్ణి కాను. యేలుకోవడానికి నేను” అంటూ ఉపమానవిధయా ప్రసంగించాడు, రాములవారి నౌకరు విన్నాడు. మనవి చేయడం తప్పక మనవి చేశాడు, దానితో కొంపమీదకే వచ్చింది. ప్రస్తుతం మనకది యావతూ విచారించ వలసిన అగత్యంలేదు. లోకంలో వుండే అపవాదకులు అపవదింపబడేవారిమీద యేదో వైరం వుంటే దాన్ని పురస్కరించుకొని యేవో అపవాదలు వేసి కసితీర్చుకుంటూ వుండడం వుందిగాని ప్రస్తుతపు రజకుడియందు అట్టిదోషం లేశమూ లేకపోవడం చేత యితణ్ణి యీ అపవాదకాపశదకోటిలో చేర్చవలసి వుండదని తోస్తుంది. సుమారు ముప్ఫైయేళ్లనాడు కాకినాడలో వెలువడే సరస్వతీ పత్రికలో - "అపవాదతరంగిణి"