పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆలాగే యిప్పటి "గిల్లికజ్జా" సమాజంవారు కూడా యేదో విధంగా సమాధానపడవలసిందని మా ప్రార్థన. యీలాంటివారంటూ వుండఁబట్టే తి|| వెం|| కవులలో ఒకరేనా యింతకాలం జీవించివుండడం తటస్థించింది కాని లేకపోతే దిష్టికొట్టి యిద్దఱూకూడా యిదివరకే ఫయిసలయేవారేమో అన్నది సత్య దూరంకాదు. జరిగిన సంగతి ఒకటి జాతకచర్యలో గ్రంథవిస్తరభీతిచే బొత్తిగా యెత్తుకోనిది యిక్కడ వ్రాసి దీన్ని ముగిస్తాను.

మొట్టమొదట యేదో స్వల్పంగా వెం|| శాII కాశీనుంచి రావడానికి వెం|l శా|| తండ్రిగారు చేసిపంపిన ఋణాన్ని తీర్చుకొనేనిమిత్తం తి|| శాII సహితంగా నవరాత్రాల ఆరంభంలో కాకినాడకు వెళ్లడం తటస్థించింది. ముందు భిక్షవకటి కుదరాలి కనుక యెవరింటికి వెడదామని అనుకుంటూ శ్రీ బోడా రాజుగారి మేడప్రక్కనున్న ఉత్తరపు వీథినుంచి పడమటగా రైలుసంచీలు చేతcబట్టుకొని విద్యార్థులతో వెళ్లుచుండఁగా, శ్రీ వేమూరి సుబ్రహ్మణ్య సోమయాజులుగారి యింటివాఁకిటిలో తి|| శాI| గారి పినతండ్రిగారి అల్లుఁడు కనcబడి తి|| శాI| గారిని పలకరించాఁడు. అక్కడికి వెళ్లేటప్పటికి మిక్కిలి ముసాలివృద్దులు సుబ్రహ్మణ్యసోమయాజులు గారు మీ రెవరని అడిగి, ఫలానావారి శిష్యులమని చెప్పినపిమ్మట, నాయనా! మీ రీ నవరాత్రాలు వెళ్లేపర్యంతమూ మాయింటే వుండవలసిందని ప్రేమపూర్వకంగా ఆదేశించారు. వారి ఆజ్ఞప్రకారం అక్కడే వుండడం తటస్థించింది. వారింటికి సమీపంలోవున్న శ్రీదురిసేటి శేషగిరిరావుపంతులవారిని సందర్శించేటప్పటికి ఆయన స్వంతంగానే ఒక సభ వారి చావడిలోనే చేయించి, అష్టావధానం చూచి, వచ్చినపని అంతకుమున్నే మావల్ల వినివున్నారుకనుక ఆ ముప్పది రూపాయీల ఋణమున్నూ తీరేటట్టు సమ్మానించారు. వచ్చినపని అయిందికనుక మళ్లా చదువుకొనేచోటు ధవళేశ్వరానికి శ్రీ బ్రహ్మయ్య శాస్త్రులవారివద్దకు వెళ్లాలనుకుంటూ వుండఁగా యీ అవధానంసంగతి వారినోటా వారినోటా శ్రీబాదం వేంకటరత్నంగారి నోటీసులోకి వెళ్లింది. ఆయన కబురంపించి, అష్టావధానం చాలచోట్ల చూచాము. మీరు శతావధానంచేస్తే సభచేయిస్తానన్నారు. వెనకసంగతి లేదుగాని యిక్కడనుంచి టూకీగా జాతకచర్యలో వున్నది. ఆ సభ జరిగింది. చెప్పేమాటేమిటంటే, ఆ సభలో సమ్మానాన్ని పొందివచ్చినరోజున మమ్మల్ని మొట్టమొదట తమ యింటివద్ద నిలిపి ఆతిథ్యమిస్తూవున్న సోమయాజులుగారు గుమ్మందగ్గిఱకు మేము వెళ్లీవెళ్లడంతోనే అక్కడే నిల్వండి అని ఆఁపుచేయించి, దిష్టిపరిహారార్థమంటూ కొన్ని ప్రక్రియలు చేయించి కాని లోపల ప్రవేశించనిచ్చారుకారు. యీ కథ ప్రస్తుతాని కెంతవఱ కుపకరించినా ఆ మహాపురుషుని కృతజ్ఞతను వెల్లడించడానికేనా పనికివస్తుందని వుటంకించాను. ఆలాటివారు చేసిన దిష్టిపరిహారాలవల్లనేమి, కొందఱు ప్రతిపక్షులు చేసే ప్రయత్నాలవల్లనేమి, మాలో వకరేమేనా