పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/394

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

398

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నాకు స్ఫురణకు వచ్చింది. యిది దైవసహాయంకాక యేమనుకోవాలి? ఆ తప్పుగల పద్యాన్ని వుదాహరిస్తాను.

తే. గీ. “వీర! చిత్రాంగదవిచిత్రవీర్యులకు వి
        వాహ మొనరించితివి కష్టపడి జయించి
        వారు నేఁటికిఁ బ్రత్యుపకార మిట్టు
        లాచరించిరి నావంటి యధముకతన.”

యిది భీష్మనిర్యాణఘట్టంలో ధృతరాష్ట్రుని వాక్యం. భీష్ముఁడు విచిత్రవీర్యునికే అంబికాంబాలికలను తెచ్చి వివాహం చేశాఁడుగాని చిత్రాంగదునికి చేయలేదు. ఆ వివాహకాలంనాఁటికే చిత్రాంగదుఁడు దివంగతుఁడైనాఁడు. యిది పెద్దతప్పు కాదనుకోండి. యేమైనా వైరు లాలా సరిపెట్టుకుంటారా? తి|| వెం|| కవులకు భారతం యేమీ తెలియదు, అని మొదలుపెడతారుగా? యీ మధ్య వక బుద్ధిశాలి, శుద్ధపత్రికలో సవరణ చూపినదాన్నే యెత్తుకొని, “చూపినా ప్రయోజనం లేదు. ఆ సవరణ వక కందపద్యంలో సవరించడానికి అవకాశం వుండ" దంటూ వ్రాశాఁడు. అప్పటికి ఆయన పునర్ముద్రణాన్ని చూడలేదుపాపం. నాయనా, ఆ కందపద్యంకూడా ఫలానాముద్రణంలో సవరింపcబడివుంది చూడుమని వ్రాశాను. చూచి మళ్లా వ్రాస్తాఁడుగదా “చూచానుగానీ, యింకొక పద్యంలో సవరించలేదు, దానికి యేముద్రణాన్ని చూడమంటా” రంటాడు. యీ మోస్తరుగా వుండే వుదారులు విమర్శకులైనప్పుడు ప్రస్తుత "చిత్రాంగద" విషయం వదలిపెడతారా? యెంతో రంజస్సు చేస్తారు. దారికెవరో సహృదయులు మందలిస్తా రనుకోండి, అంతదాఁకాకూడా రాకుండానే దైవం చేశాఁడుగా! వాళ్లకు ఆస్థలాన్ని కనపఱచనేలేదు. గ్రంథకర్తకే అప్రయత్నంగా ఆస్థలాన్ని కనపఱచాఁడు. దానితో గ్రంథకర్త యీ అంశాన్ని వుదాహరించి “నాయనలారా, మీరు దైవోపహతులు, కాఁబట్టి మీకు నిజమైన తప్పులు కనcబడవు" అని యీ మాటను సమర్ధించడానికి పైపద్యం వుదాహరించి మందలించడానికి అవకాశం కూడా కలిగింది. ఈ విషయం పాశుపతం చూస్తే తెలుస్తుంది. కాcబట్టి విస్తరించేదిలేదు.

యింతకూ వ్రాసే ముఖ్యసంగతి యేమిటంటే : తి|| వెం|| కవుల విజయాలల్లో నూటికి తొంబదులు దైవానుగ్రహ లబ్దాలనిన్నీ మిగతా పదిన్నీ స్వప్రయోజకత్వంవల్ల వచ్చినవనిన్నీ మనవిచేసుకోవడానికి ఆయీ విషయాలు వున్నవివున్నట్లు వ్రాయడం. అప్పటికింకా ప్రథమ ముద్రణంలో సరస్వతీపత్రికలో ప్రకటితమైన “పాండవ విజయం” ద్వితీయముద్రణం కానికారణంచేత దానినిండా యెన్నో వ్యత్యాసాలు వున్నాయి. అట్టిదాన్ని వదలి పాండవాశ్వమేధాన్ని ప్రతిపక్షులు విమర్శించడానికి పూనుకోవడంకూడా