పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పుణ్యైర్యశోలభ్యతే"

397

యెవరికవిత్వాన్నిగాని మా అంతటమేమై విమర్శించి, నిజమైనవిగాని, అబద్ధమైనవిగాని దోషాలువున్నట్టు యింతవఱకు ప్రచురించినట్లు నాకు జ్ఞాపకంలేదు. నాకు రామశబ్దం దగ్గఱనుంచీ ప్రయోగించడానికి సంశయమే. యెందుచేత? అందులో తప్పేముందో అనే శంకచేతనే. రామశబ్దమంటే రామశబ్దం కాదనుకోండి; నాదంత అనుమానం మనస్సన్నమాట. యెవరి కవిత్వంలోనేనా యేదేనా తప్పుగా తోఁచినప్పటికీ యే మహాకవి యెక్కడ వాడింది చూచి ఆయన ప్రయోగించారో అని అనుకుంటానుగాని చట్టన తప్పనేదిలేదు. యెంతో ఆలోచిస్తాను. యెందఱినో అడిగిచూస్తాను. అప్పుడుగాని దాన్ని రంగంలో ప్రవేశపెట్టేది లేదు. అదేనా యే సందర్భంలోనంటారు? మా మీఁద కెవరేనా “గిల్లి కజ్ఞా"కు దిగితే వారి శిరోభారం తగ్గించడానికితప్ప పనిలేని పాటగా యెవరిమీఁదకీ వెళ్లేది లేదన్నది చదువరులు జ్ఞప్తిలో వుంచుకోవాలి. ఆ కారణంచేతనే యింతవఱకు మేము వెళ్లిన వాదాలేవిన్నీ వోడిపోలేదన్నది ముఖ్యాంశం. అది కొంత యశస్సుకు కారణం.

యింకొకటి యిక్కడ వ్రాయాలి. మొదటినుంచిన్నీ మాకు పలువురు శత్రువు లుంటూవున్నసంగతి లోకవిదితమే. ఆ శత్రువులు మా పుస్తకాలలో తప్పులుపట్టి మము అవమానించడానికి పూనుకొని వ్యర్టులవడం తటస్థించడంకూడా లోకు లెఱిఁగినదే. అందులో కొంత న్యాయమైన మా ప్రతిభ లేకపోలేదుగాని దైవసహాయం చాలావుంది. వుదాహరణకి ఒకటి మనవి చేసుకుంటాను. మా పాండవాశ్వమేధంలో ప్రతిపంక్తికిన్నీ గీటులుంచి తప్పులని యెవరైతేనేమి ప్రకటించారుగదా! అందులో అన్నీ సమాధానం చెప్పఁదగ్గవే కావడమేమి? యే ఒకటి రెండో నిజమైన ప్రమాదాలు వున్నప్పటికీ అవికూడా అన్యథా మార్గాంతరంచేత సమాధానం చెప్పఁదగ్గవి కావడమేమి? “మరుద్భూపాలుఁడు" అన్నదానికి చెప్పినసమాధానానిక్కాcబోలును, ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రులుగారు నిర్ఘాంతపడ్డట్లు విన్నాను. యెంతసత్యమో? పూర్తిగా సమర్థించడానికే వీలులేని ప్రమాదాలు ఆ నాటకంలో మచ్చుకేనా లేకపోయాయా? వున్నాయి. యెన్నోలేవు. నాయెఱిఁగినంతలో ఒక్కటిమాత్రమే వుంది. అది మాప్రతిపక్షుల కెందుకు కనపడకపోవాలి? వారికేకాదు, వారి విమర్శనకున్నూ దానికిచ్చిన మాజవాబుకున్నూకూడ చాలా యిటీవల యెంతో కాలందాఁకా అది మాకున్నూ గోచరించనేలేదు. గోచరించినప్పుడేనా ఆ పుస్తకం చదివి పరిశీలించేటప్పుడు గోచరించలేదు. యేదో పనిమీఁద బజారుకువెళ్లి కృష్ణాప్రెస్సులో ఆలస్య మవడంచేతనూ, స్కూలుటైము అప్పటికే అతిక్రమించడంచేతనూ తొందరగా యింటికి వస్తూవుండంగా శ్రీకాశినాథుని బ్రహ్మయ్యలింగంగారి యింటిప్రక్క సందులో నడుస్తూ వుండఁగా ఆ తొందరలో హఠాత్తుగా పాండవాశ్వమేధంలోవున్న నిజమైన మా ప్రమాదం