పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

396

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యెట్టి సవరణతోగాని లేశమున్నూ అవసరంలేనిచోట సవరణ ప్రతిపాదించడంచేతనే నేనీ అంశాన్ని గ్రహింపఁగలిగానుగాని ఆయనకన్న మనం యెక్కువ చదివినవాళ్లమని కాదన్నాను. అయితే యిప్పుడే యెదురుకోలేదేమి, సవరిస్తానన్నావేమి? అన్నాఁడు. యిప్పుడే ఆయనతో కలహమెందుకు? ఆయనవున్న సంస్థానానికి మనం వెడుతూ యింకా వెళ్లడానికిముందే పోట్లాడడం ఆలోచనపని కాదు. వీలైనంత వఱకు తప్పుకోవడం మనపని. అంతకూ తప్పనివిధి అయితే - “త్వంశుంఠ, త్వంశుంఠ" యేలాగా తప్పదు, అన్నాను. తుదకు అక్కడికి వెళ్లడమూ, ఆయనతో వాదం రావడమూ, ఆయనకు వోడూ, మాకు జయమూ, గజారోహణోత్సవమూ, అందఱున్నూ యెఱిఁగినదే.

అక్కడేమీ పెద్ద శాస్త్రచర్చ జరుగలేదు. వ్యాకరణంలోతప్ప ఆయన మాకు లొంగరు. నాలుగు శాస్త్రాలువచ్చి సంస్కృతంలో బేబాగానున్నూ ఆంధ్రంలో కచ్చాపచ్చాగానున్నూ కవిత్వం ఛెప్పఁగల ప్రజ్ఞవుంది ఆయనకు. అయితే ఋజుమార్గవర్తి మాత్రం కాకపోవడం ఒకటి లోటు, యేలాగయితేనేమి, తొందరపడి,

“ఉ. నా పలు కాలకింపుమ యనంత! గుణాలయనైనయట్టి నా
     రూపముమాత్ర మొప్పుగ నిరూపణఁజేసి యెఱుంగుదీవు, దు
     ష్ప్రాపము నీకు నిర్గుణత భాసిలు నప్పరదేవతామహా
     రూపము, తెల్పె నాపె యిది రూఢిగ భాగవతాఖ్యమంత్రమౌ."

అన్న దేవీభాగవత ప్రథమస్కంధపద్యంలో "గుణాలయ" అనే చోట ఆక్షేపించి భారతోదాహరణమిస్తే దాన్ని దిద్దడానికి ప్రయత్నించి ఆయన వోడిపోయి మాకు గజారోహణోత్సవానికి కారణభూతులైనారుగాని మాప్రజ్ఞావిశేషం లేశమున్నూ లేదనుట నిశ్చయం.

యింతకు కొంచెం పూర్వం బులుసు పాపయ్యశాస్త్రులవారి మనుమరాలు, ప్రకాశశాస్త్రులవారి కొమార్త వివాహసందర్భంలో మనజిల్లాలోవున్న యావన్మంది పండితులున్నూ వచ్చివున్న సభలో ఒకగాయకుఁడు మంచి సంస్కృతసాహిత్యంకల దిట్ట, కవికూడాను, ఆయనతో కొంచెం మాకు వలచి' “పంకేరుహనేత్రి" అనే పదాలవిషయమై వాదం వచ్చింది. ఆయన తరఫున "అపరగౌతము" లనఁదగు ఒకానొక మహాతార్కికులు పూనుకున్నారు. వారితోపాటు కొందఱు వైయాకరణులు పూనుకున్నారు. యేంలాభం? వారు పట్టింది ములగకొమ్మ అవడంచేత, మమ్మల్ని వోడించడానికి అవకాశం లేకపోయింది. అంతేగాని ఆవిషయములోకూడా మాపాండిత్యం చేసిన పని లవమున్నూలేదు.