పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/391

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"పుణ్యైర్యశోలభ్యతే"

395


“ఆయనకు వున్నన్ని ప్రజ్ఞలు మనకు లేవు కనక ఆయనకి మనమే లొక్కుతామేమో" అని మనస్సులో వుండేది. కాని యేమైనాసరే, వెళ్లడం మాత్రం తప్పదు. “యశోవా మృత్యుర్వా" అనుకుంటూ వుండేవాళ్లం. యితర విషయాలెట్లున్నా అవతలి పండితుcడితో నాలుగు మాటలు మాట్లాడడం తటస్థించేయెడల ఆయన్ని మనం జయించేదీ మనల్ని ఆయన జయించేదీ, తెలుసుకోగలనని నాకు ఆ రోజుల్లోనేకాదు యెప్పుడున్నూ ఒక ధిమాకు వుండేది. అయితే ఆయన గద్వాలసంస్థానానికి వచ్చేదేలాగ? వస్తేనేకదా మనకు కనపడేది. యీ సంస్థానం వారితో ఆయనకు సరిపడదు. యీలావుండఁగా ఒకరోజు తెల్లవారు జామున మేము బసచేసిన యింటి అరుగుమీఁద దేవీభాగవతప్రథమ స్కంధం తెలుఁగుచేస్తూ యిద్దఱమున్నూ కూర్చున్నాము. దైవవశాత్తుగా ఆ పండితుఁడు చుట్టాలింటికి వచ్చి కాఁబోలును తిరిగి స్వగ్రామానికి వెడుతూ అక్కడ కొంచెం నిల్చుండి "ఓహో! మీరే వో తిరుపతి వేంకటేశ్వరులు?” అని గంభీరంగా పృచ్చచేశారు. అంతకుమునుపు ఆయన్ని చూడకపోయినా మేముకూడా “ఓహో! తామేనా ఫలానా ఆచార్లవారు?” అని లేచి దయచేయండి అని పిలిచాము. వచ్చారు. కూర్చున్నారు. యేమిటి వ్రాస్తూ వున్నారన్నారు. దేవీభాగవతం తెలిఁగిస్తూ వున్నామన్నాము. యేదీ వక పద్యం చదవమన్నారు. చిత్తం అని-

“చ. చదివితి వెల్లవేదములు శాస్త్రములం బరికించినాఁడ వి
     య్యదను వివాహయోగమగునట్టిది గాన కళత్రమున్ వరిం
     పదగు మఖక్రియల్ పొనరుపందగుఁ బుత్రులఁ గాంచఁగాఁదగున్
     ముదమలరన్ మమున్ ఋణవిముక్తులఁ జేయఁదగుం గుమారకా!"

అన్న పద్యాన్ని అప్పుడే వ్రాసిన దానిని వినిపించాము. వినీ వినడంతోనే తుట్టతుదనున్న "కా" తీసివేస్తే బాగుంటుందన్నారు. చిత్తం, యిప్పడేకదా వ్రాశాము, సాపు వ్రాసేటప్పుడు మీ సెలవుప్రకారం సవరిస్తామన్నాము. తరువాత వారితోవను వారు దయచేశారు. మా వాడితో నే నన్నానుగదా, యీయన మనతో డీకొంటే తప్పక వోడిపోతాఁడురా అన్నాను. యేమన్నాఁడు, యేమో నా కల్లా తోఁచిందన్నాను. చెప్పాలన్నాఁడు. గంభీరుఁడుకాఁడు. తొందర మనిషి ఎప్పుడూ చూడక చూడక చూచినవాళ్లంగదా మనం? విన్నది వకపద్యం. దానిలోవున్న కుమారకా అనేపదం బాల, బాలక, పుత్ర, పుత్రక వంటిదిగాని దోషజుష్టం కాదాయె. యేదో కొంత పేరున్నవాళ్లని వింటూన్నట్టు ఆయన మాటలవల్లే తెలుస్తూ వుందాయె, నిజమైన తప్పన్నా అపరిచితుల విషయంలో ప్రథమసమాగమంలోనే సవరణను ప్రతిపాదించవలసివుండదు. అట్టి స్థితిలో