పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/390

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

394

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శుద్ధ తప్పుగా వుందికనక చెప్పకూడదన్నాం మేము. యిచ్చిందేదో చెప్పవలసిందేకాని మీరు దాన్ని ఖండించడానికి మీకు (అవధానులకు) అధికారం లేదన్నారాయన. అది సరికాదు, యిక్కడ వున్నవారికి యీ తప్పు తి|| వెం|| కవులదికాదు పృచ్ఛకులదే అని తెలుస్తుందికాని, యివి అచ్చై ప్రకటితమైన పిమ్మట యెవరిదీ కవిత్వ మంటే తి|| వెం|| కవులదంటారు, అప్పుడు దానివల్ల వచ్చే అగౌరవం మా నెత్తినే పడుతుంది. కాcబట్టి యీ కల్పన వదలుకొని మఱొకటి అడగమన్నాము. దానిమీఁద ఆయన అన్నారుగదా:- "యీకల్పన నాదికాదు వసుచరిత్రలోదండోయి" అన్నారు. “అయితే దాన్నే మేమున్నూ ఆక్షేపించిందిన్నీ మీరు సమర్ధిస్తే యీ కల్పన పుచ్చుకొని పద్యం చెపుతాము, లేదా? మఱొకటడగండి" అన్నాము. సమర్ధించలేక ఆయన ఆ కల్పన వదలుకున్నారు. దానితో మేమేమో ఆయన్ని జయించినట్లు పామరులకే కాక పండితులక్కూడా తోఁచింది.

యిఁక గద్వాలలో సంగతి. ఆ పండితులు ఋజుమార్గం విడిచి రాజుగారితో మా విద్వత్తునుగూర్చి అబద్ధాలు చెప్పడంవల్లనే తప్ప యేస్థలంలోగాని, అర్థంలో లేక శబ్దంలో విద్యాసంబంధమైన వాదోపవాదాలు లేశమూ జరిగినట్లు లేదు. ఆ కపటం యేలాగయితే నేమి రాజు గారికి కొంతకాలానికి బోధపడింది తుట్టతుదకు. పిమ్మట అవధానం చేయించి చూచారు, సంతోషించారు, సరిపోయింది. గద్వాలపండితులు సరియైన మార్గాన్ని అవలంబించేయెడల అందఱితోపాటేగాని, అక్కడ మాకు యొక్కువ సమ్మానం జరిగివుండదు.

యిఁక ఆత్మకూరువిషయం. గద్వాలకు ఆత్మకూరు మిక్కిలి సమీపం. మూఁడుకోసుల దూరంలో వుంది. మధ్య కృష్ణానది మాత్రమే అడ్డు. గద్వాలకు వచ్చినవాళ్లెవళ్లుగాని ఆత్మకూరుకి వెళ్లడం మానరు. అట్టిస్థితిలో మేము వరుసగా రెండేళ్లు గద్వాల వెళ్లికూడా ఆత్మకూరికి వెళ్లకుండానే దేశానికి వచ్చేశేవాళ్లం. దీనిక్కారణం, యీవూళ్లో సమ్మానింపఁ బడితేకదా యితరత్ర సమ్మానానికి యత్నించడం అనుకోవడమే. రెండోయేట గద్వాలలో సమ్మానం జరిగిందికాని అప్పటికప్పుడే ఆత్మకూరిలో వుత్సవం అయిపోయింది. అదిన్నీకాక యువరాజుగారి పట్టాభిషేకంవఱకున్నూ వుండవలసిందని గద్వాలరాజుగారు కొన్నాళ్లు ఆపుచేశారు. దానాదీనా "వేసవి దగ్గఱయ్యె" అనే పద్యంలో వుండే అర్థం స్ఫురణకువచ్చి రెండోయేడుకూడా ఆత్మకూరు వెళ్లనేలేదు. మూడోయేడు గద్వాలకు వెళ్లేము. తప్పక ఆత్మకూరు వెళ్లాలనిమాత్రం వుంది. ఆ సంస్థానంలో ఒక పండితుఁడున్నాఁడనిన్నీ ఆయన నాల్గు శాస్త్రాలువచ్చినవారనిన్నీ ఆశుకవిత్వం చెప్పేవారనిన్నీ చాలా సమర్థులనిన్నీ చెప్పడం మాత్రం వింటూవున్నాము. ఆయనకున్నంత పేరు ఆ ప్రాంతంలో యెవ్వరికిన్నీలేదు. కాని మమ్మల్నిచూచి కొందఱు వీరికి ఆయన లొక్కుతారని అనుకొనేవారు. మాకు మాత్రం