పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/381

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

385


తెలుసుకొందురు గాక. యీ పద్యచమత్కృతి తెలపడానికే ప్రసక్తిలేని ప్రసక్తి కల్పించి యీ ఘట్టంలో వుదాహరించాను. అతఁడని అతఁడేకాదు వేఱొకరేనా యీలాటి పద్యాలతో నన్ను తిట్టినా నేను సంతోషిస్తాను. ఇది నా ప్రకృతి. యీ పద్యం నేను బందరు భైరవప్రస్సుకు వుత్తరాన్నివున్న చవిటి అరుగు మీఁద బొత్తినకాళ్లు వూఁతగా కూర్చుని యేదో తదేకదీక్షతో ప్రూఫులు దిద్దుకొనేదృశ్యాన్ని చిత్రిస్తూవుంది కాని “వంటియందు చారలుండడం" యెందుకు చెప్పాఁడో యిప్పుడు గోచరించిందికాదు. వెనకేనా వాణ్ణి నేను అడిగి తెలుసుకున్నట్టున్నూ లేదు. లేక తెలుసుకునే మఱచిపోయానో? 'జీవితః కవేః ప్రష్టవ్యమ్‌' కదా! బహుశః అతనివుద్దేశంలో యీ 'చారలు' విభూతిరేఖలై వుంటా యనుకుంటాను. 'యద్దేవా' కవిత్వం చెప్పడానికేమి, వీరరసకవిత్వానికేమి, తగాయిదాలు తెచ్చే కవిత్వం చెప్పడానికేమి అతఁడు మంచి మొనcగాడు.

శ్రీ ఆత్మకూరి రాజావారి మేనల్లుఁడుగారు "తిరిపపు. ... తమిదీరద యేచెలి నాశ్రయింతునో?" అని ఒక సమస్యను యొక్కడినుంచో సంపాదించినదాన్ని ప్రతిరోజూ మాకు వినిపించి "సామీ! నాకు దీన్నిపూర్తి చేసిపెట్టాలని కోరుతూ వుండేవారు. యేరోజుకు ఆరోజు నేను "తిరుపతి శాస్త్రిగారికి యీలాటి పూర్తివిషయంలో మంచి ప్రజ్ఞకనుక ఆయన్ని తమరు కోరండి" అని తప్పించుకొనేవాణ్ణి, ఆలా సుమారు నెలపైదాఁకా జరిగింది కాలం. మా ప్రయాణం రోజులు సమీపించాయి. అట్టి సదర్భంలో ఆయన ఒకరోజున “యీవేళ పూర్తిచేస్తేకాని మిమ్మల్ని కదలనిచ్చేది లే"దని గట్టిగా పట్టుపట్టి కూర్చున్నారు. అనుచితమైనదే అయినా పూరించడం తప్పిందికాదు. తి. శా. గారినే వప్పఁజెప్పాను. క్షణంలో పూరించి వ్రాసి యిచ్చాఁడు. యిచ్చిన సమస్యకు తగినభాషనే వుపయోగించాఁడు. రేఫప్రాస కనక “తిరుమణిఁ దాల్చు" అని ప్రారంభించాఁడు. శృంగారరసంలోనే దక్షిణనాయకశృంగారం వర్ణించాఁడు. బాగానేవుంది, యెవరినీ దూషించే వుద్దేశం లేకపోయినా మాకు అక్కడ విరోధులుగా వుండే వైష్ణవులను గూర్చి అది చెప్పినట్టు వారిలో కొందఱు అభిప్రాయపడ్డారు. అది పూర్తిగా సత్యదూరమే అయినా “రంధికిమూలమే ఱంకులకోడలా!" అన్నట్టు అందులో మొట్టమొదటనే వారి ప్రధాన చిహ్నం ‘తిరుమణి" పడింది. యింకా కుంకుమ, విభూతి వగయిరాలు ఆ పద్యంలో వున్నా అవి ప్రథమంలో లేవు. దానితో ఆవూరివారేమీ కలిగించుకోలేదు గాని, గద్వాలలో మాకు ప్రతిపక్షులుగా వుండే వైష్ణవ పండితులు కలిగించుకొని మా యిద్దఱినీ నీచాతినీచోక్తులతో నిందిస్తూ ఒక చంపకమాల రచించి వారిశిష్యుఁడు భట్రాజు చేతికిచ్చి పంపించారు. అ భట్రూజు విద్యార్థి దూరంగానే నిల్చుండి "మా గురువులు దీన్ని మీ కిమ్మన్నారు" అనిచెప్పి మామీఁదికి విసిరేసి పాటిపోయాఁడు. ఆ పద్యం చూచుకొని మేము నవ్వుకొని వూరుకున్నాము.