పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/380

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

384

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యేవిద్యార్థేనా చదువుకోవడానికి వస్తే తెలివికలవాఁడా, కాఁడా అనే వివేచనతో పనిలేకుండా చెప్పడానికి మొదలుపెట్టడమే నాప్రకృతి-ఆతనిదో? దీనికి అంగీకరించేది కాదు. అందఱూ తనంతటి బుద్ధిమంతులుగానే వుంటే తనదగ్గిఱికి శుశ్రూష కెందుకు వస్తారని అతనికి తట్టేదే కాదనుకుంటాను. సరే! తనకి నచ్చిన విద్యార్డు లెక్కడ తటస్థిస్తారు? అందుచేత యెవఁడికోకాని తాను చెప్పడమంటూ వుండేదే కాదు. పయిగా నాదగ్గిఱ చదువుకొనేవాళ్లనూ, నన్నూ వెక్కిరించడం కూడా వుండేది. వెక్కిరించడం అంటే వట్టిమాటలతో మాత్రమేకాదు. పద్యాలతోటే!

మ. “గురువై శిష్యులఁ జేర దీయునెడఁ దక్కుంజెయ్వు లెట్లున్నఁద
      త్పరబుద్ధిం దిలకింపఁగా వలయుఁ "జెప్పందగ్గవాఁడౌనొ? కా
      దొ? రహస్యంబులు, తెల్వియున్ గలదొ? లేదో?" యంచునావేంకటే
      శ్వరశార్దూల మమాయికం బెఱుఁగ దీచర్చాప్రకారమ్ములన్."

యీ మత్తేభం వుపన్యసించే వుపన్యాసంలో వున్న శార్దూలం నేనే అని వేఱే చెప్పనక్కఱలేదుకదా! తిరుపతి వెంకటేశ్వరుఁడితో అభేదాధ్యవసాయం చేస్తూ దాని వెనకాల వుటంకించిన వేంకటేశ్వరపదమే వ్యాఖ్యానం చేస్తూవుంది. పయిఁగా నన్ను వాఁడు “అమాయికుఁ"డని కూడా అనుకొనేవాఁడన్నదికూడా దీనివల్ల తేలుతూవుంది. బందరు హైస్కూలు హెడ్మాస్టరుగారు కూడా నన్ను వెఱ్ఱివాళ్లల్లోనే జమకట్టే వారు. యీ అమాయికత్వమూ, వెఱ్ఱివాలకంగావుండడమూ “స్వరాజ్యం నాజన్మహ"క్కని శ్రీయుతులు తిలకుగారు చెప్పినట్టు మాకు వంశపరంపరాహక్కుగా మా బంధువులు చెప్పుకుంటారు. కనక నేను దీన్నిగూర్చి మావాఁడితో యేమాత్రమూ చర్చపడలేదు. కాని నా అమాయకత్వం మాయ తెలియని అమాయికత్వం కాదనిన్నీ అది తెలిసికూడా పరలోక భీతిచేత దాన్ని యెన్నఁడున్నూ వినియోగించేవాణ్ణి కాననిన్నీ జిజ్ఞాసువులు తెలుసుకోఁగోరుతాను. యీ అన్యాపదేశసందర్భంలోనే నన్నుఁ గూర్చి యింకోపద్యంకూడా వ్రాశాఁడు.

మ. "ఒడ లెల్లం బలుచార లుండుటయు వాలోపాంతమం దూని ముంద
       దడుగుల్ మోవఁగఁ గూరుచుంటయును మున్నౌచిహ్నముల్ కంటగ
       న్పడురంగున్ దిలకించి మీసములచందమ్మున్ విలోకించి వీ
       ఱిఁడిపిల్లిన్ దనశాఖలోని దనుచున్ బ్రేమించె శార్దూలమున్."

యీ రెండు పద్యాలు నన్ను "యద్దేవా" చేసేవే అయినా యెంత ప్రౌఢంగా వున్నాయో, యెన్ని విడివిడిపదాలతో కూర్చఁబడివున్నాయో, యెంత గమకంగా వున్నాయో చదువరులు