పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


రాజావారు యెవరికి వాదోపవాదాలు పెట్టివున్నారో వారి తారతమ్యం మంత్రశాస్త్ర ప్రయోగంవల్లనే సుళువుగా గ్రహింపగలిగారనుకోవచ్చు. లేకపోతే మాధ్యస్థ్యం చేయడానికి వచ్చిన పండితులకేమి వాదించడానికి కూర్చున్న గోపాలశాస్రుల్లుగారికేమి లేశమున్నూ అవగాహనకాని విషయం యెంత శ్రుతపాండిత్యం వున్నప్పటికీ రాజావారికి తెలియడం తటస్థింపవలసివుండదు. యితర విషయాలయితే శ్రుతపాండిత్యానికి లొంగుతాయేమోకాని శాస్త్రవిషయం లేశమున్నూ శ్రుతపాండిత్యానికి లక్ష్యపెట్టదు. “అనభ్యాసే విషంశాస్త్రం" అని వూరికేనే అన్నారా పెద్దలు? అందులో తర్క శాస్త్రం చెప్పనే అక్కరలేదు. యితర విషయాలుకూడా కొన్ని చిక్కగానే వుంటాయి. ఉదాహరణకి కొన్నిచూపి యీ వ్యాసం ముగిస్తాను.

భారతంలో ద్రోణాచార్యవధ ఘట్టంలో “అశ్వత్థామా హతఃకుంజరః" అని పల్కినవాండు సాక్షాత్తూ ధర్మరాజా? మరివకరా? ధర్మరాజే కదా! పాండవ విజయంలో హిడింబతాలూకు పరిజనంలో రాక్షసుండెవరో కామరూపం కలవాండు ధర్మరాజు రూపంతోవచ్చి ఆ అబద్ధం ఆడినట్లు కల్పించంబడ్డది. యిది శాస్త్రసంప్రదాయం తెలియక కేవలమున్నూ భారతకధా సందర్భమే యెరిగివున్న శ్రుత పాండిత్యం కలవారికి శుద్ధ తప్పగా తోంచితీరుతుంది. ఆలాగే మురారినాటకంలో వాలిన్నీ శ్రీరాముండున్నూ యెదుటCబడి యుద్ధంచేసినట్లున్నూ ఆ యుద్ధంలోనే వాలిహతమైనట్టున్నూ వుంది. నాటక సంప్రదాయం తెలిస్తే తప్ప యిదిన్నీ కేవలం విరుద్ధంగా తోంచకమానదు. ఆలాగే ప్రభావతీ ప్రద్యుమ్న నాటకంలో గదుడు శ్రీ కృష్ణమూర్తి తమ్ముఁడనక కొడుకని కల్పింపబడివుంది. ఆయీకల్పనలకు కొన్ని వుపయోగాలు వున్నాయి. మొదటిదాని కేమి వుపయోగమంటారా? ధర్మారాజంటే లోకానికి చాలా గౌరవించతగ్గ వాడుగదా? అవసరాన్ని ಬಲ್ಲಿ అట్టి మహాపురుషుండే అబద్ధమాడినట్లు నాటకంలో వుండేయెడల, -అది దృశ్యప్రబంధ మవడంచేత పలువురు పండితులుమాత్రమే కాక పామరులుకూడా నాటకం చూడటానికి వస్తారుగదా, - వాళ్లందఱున్నూ “ధర్మరాజంతవాండే అవసరాన్నిబట్టి అబద్ధమాడితే సామాన్యులం మన మెందుకాడగూడదనుకొని దుర్నీతిపరులవుతారు. కాబట్టి, అట్టికల్పన చేయవలసివచ్చింది. అలాగే వాలిన్నీ రాముండున్నూ, యుద్ధంచేసేసందర్భమున్నూ వకలోకంకాదు, పద్ధాలుగులోకాలున్నూ, నెత్తిమీంద పెట్టుకొనే శ్రీరాముండువాలిని చెట్టుచాటునుండి-అంతేకాక యితరుcడితో పోట్లాడుతూవున్న సమయంలో వధించాడంటే యెంతేనా తప్పిదంగా వుంటుందికనక నాటకంలో మార్గాంతరంగా ఆ కళంకాన్ని తొలగించాడు. ప్రభావతీ ప్రద్యుమ్ను నాటకంలో ప్రద్యుమ్నుండున్నూ గదసాంబులున్నూ, వెరశి ముగ్గురున్నూ వజ్రనాభ, సునాభులనే రాక్షససోదరులయొక్క కొమార్తలైన ప్రభావతీ