పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/379

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

383


ఆలాగే కాకపోతే నాబంధువు లందఱూ నన్ను "కొడుకులకు యింగ్లీషు చెప్పించాఁడు కాఁడు యీచేదస్తుఁడు" అంటూ గాఢంగా దూషించడానికి అవకాశం యిచ్చేది. నేను జవాబు చెప్పలేక చిక్కుపడవలసి వచ్చేది. యిప్పుడు “అవ్వా గుఱ్ఱమూ ఒకటే" కావడంచేత నాకు ఆ చిక్కు తప్పిందని సంతోషిస్తూ వుంటాను.

నే నయితే కర్మిష్ఠినిగాను గాని వేదోక్తకర్మకలాపాన్ని ఆచరించేవారిని చూస్తే నాకు చాలా ఆనందం. అంతేకాదు- "స్వధర్మే నిధనం శ్రేయః" అనే భగవద్గీతావాక్యమందు నాకు యెక్కువ విశ్వాసం. దీనికి వ్యతిరేకించి చేసే సంస్కారాలు నాకు గిట్టవు. అందుచేత ప్రసక్తాను ప్రసక్తంగా నా అభిప్రాయాలు ప్రస్తుతలోకం పాటించదని పూర్తిగా యెఱిఁగుండీ కూడా వ్రాస్తూవుంటాను. ఆ వ్రాతవల్ల జరిగేపని గడ్డిపఱకంతకూడా లేకపోయినా యెందఱో ఖండనమండనాలకి వుపక్రమిస్తూ వుంటారు. కొందఱు గాఢంగా దూషిస్తారు కూడాను. ఆలా దూషించి అంతతోకూడా తృప్తికలగక కొందఱు యింకా యేదో “వక్రః పంథాః”లోకి దిగి వంచించాలని ప్రయత్నిస్తారు. నేను వ్రాసిన వాక్యాలను యింట్లో కూర్చుని సమర్థించ మంటే సమర్ధిస్తాను కాని పడకకుర్చీ వదిలి యెక్కడికీ వచ్చి వక్రమార్గాలకు తగ్గ వక్రమార్గాలు తొక్కి సమర్ధించే వోపిక నాకు అంతరించి అప్పుడే నాలుగైదేళ్లు కావచ్చింది. వోపిక వున్నప్పటికీ ధర్మాధర్మ నిర్ణయానికి గాని, యుక్తాయుక్తనిర్ణయానికికాని ఆలాటి “వక్రః పంథా" ప్రకరణాలు కార్యకారులు కావని నానిశ్చితాభిప్రాయమని లోకానికి తెల్పుతూ ప్రకృతం వుపక్రమిస్తూవున్నాను.

మావాఁడికి పట్నవాసంలో వుండడం యిష్టం. నాకు పల్లెటూరి నివాసం యిష్టం. అతఁడు స్వగృహం లేకుండాకూడా కాకినాడలోనే యిటీవల శ్రీ పోలవరపు జమీందారుగారి నిర్యాణానంతరంకూడా నివసించడం పైకారణంచేతే అని చెప్పనక్కఱలేదు. పయిగా నన్ననేవాడు కదా "నేను నెల 1 కి రు. 10లో, లేక 8 రూపాయిలో అద్దెతో కాకినాడలో తక్కువ వ్యయంతో కాలక్షేపం చేస్తున్నాను. వేయిరూపాయిల మీఁద వచ్చే వడ్డీకన్న నా అద్దెకు అవసరం లేదు. నీవేమో సుమారు అయిదాఱువేలు ఖర్చుపెట్టి గోడిరాళ్లదిబ్బ కడియంలో యిల్లంటూ కట్టావు. నీకన్న మూర్జుఁడంటూ నాకు కనపడ" డనేవాఁడు. అయితే అతనివూహ యింటికి పెట్టిన అయిదాఱువేలూ వడ్డీకి వేసుకుంటే లాభకారిగా వుండే దనేకాని మఱోటి కాదు. నిజంగా ఆలాగే చేసుకొని వుండే టట్టయితే యిప్పటి కొత్తరూల్సుప్రకారం “ఉభయతో భ్రష్టత్వం” సంభవించేది. కాని అప్పటికి యీలాటి మహోపద్రవం వస్తుందని అతఁడు తెలుసుకోవడానికి అవకాశం లేదు కనక నాకంటే అతని ఆలోచన సర్వథా ప్రశంసనీయమే అని వొప్పుకోక తప్పదు.