పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

374

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

అప్పుడు అచ్చులు లేవు. దానికోసం యెవరినో ఆశ్రయిస్తే వారు పరశ్రేయస్సహనం వున్న యోగ్యులయితే రోజూ ఒకటో రెండో తాటాకులవంతున వారి సమీపంలోనే కూర్చుని రాసుకోవడానికి అనుగ్రహించి యిచ్చేవారు. యీ యివ్వడం వగయిరాలు నేను స్వయంగా నయితే నారోజుల్లో చూడలేదుగాని మాముత్తాతగారి గ్రంథాలు యెవరికేనా యివ్వవలసివస్తే మాతాతగారు యీలాగే యిచ్చేవారని మాతండ్రిగారు చెప్పఁగా విన్నాను. ఆ ధనాన్ని యింత జాగ్రత్తగా మా తాత తండ్రులు వంశస్థులకోసం భద్రపఱిస్తేకూడా అందులో ముఖ్యగ్రంథం మాముత్తాతగారి కవిత్వం “యామినీపూర్ణతిలకావిలాసం" చెట్టెక్కడం తటస్థించింది. “పుస్తకం వనితా విత్తం పరహస్తంగతం గతమ్" అనేమాట ఆకాలంలో బాగా అమల్లో వుండేది. యిప్పుడు పుస్తకానికి ఆబాధ పూర్తిగా తొలంగింది. కాని విత్తానికి మాత్రం అప్పటికంటేకూడా యెక్కువ దురవస్థ తటస్థించి, "ఋణస్య దానస్య న కించిదంతరం మృతస్య సుప్తస్య న కించిదంతరమ్" అనేది పూర్వంకంటే యెక్కువ అమల్లోకి వచ్చింది. కాలపరిస్థితులని బట్టి యిట్టి అభియుక్తోక్తులు పుడతాయి. అవి మాఱిన పిమ్మట ఆయీ అభియుక్తోక్తులకు అర్థం అపార్థంగా కనపడుతుంది. -

మునుపు మనదేశంలోనూ, యితర దేశాల్లోనూ జమీందార్లువారి వారి తాహతు ననుసరించి చిన్నదో, పెద్దదో కోట అంటూ కట్టుకొనేవారు. యిటీవల బ్రిటిషు ప్రభుత్వం వచ్చాక అనోన్యకలహాలు యుద్ధరూపంలో అమలుజరగడానికి వీలులేక కోర్టుల్లో మొదలు పెడుతూ వున్నారు. అందుచేత ఆ కోటల మరమ్మత్తులో పనీ లేకపోయింది. పోనీ, వున్నదాన్నేనా నిలఁబెట్టుకుందా మంటే సర్వాధికారంకల చక్రవర్తి అందుకు అంగీకారం యివ్వడమూలేదు. ఇది విషయాంతరం.

పోతరాజుగారు ఆలాకప్టించి భాగవతం వ్రాసుకోవడంలో అంతకు ముందు యేస్వల్పంగానో వున్న సంస్కృతశ్లోకాన్వయజ్ఞానం పెచ్చు పెరిఁగి వుంటుంది. ఆలా పెచ్చు పెరిఁగినా యింకా సందేహాలు - యిందాఁకా నేను చూపినమాదిరివి, వ్యాఖ్యానసహాయం వున్నా తీరనివి వుంటే ఆ వ్రాసుకునేటప్పుడో, లేక అనువదించేటప్పుడో, "అయ్యా! యేమిటి యీస్థలంలో తాత్పర్యం?" అని అడిగి తెలుసుకొని వుంటారు. (లేదా వుపాస్య దైవం వల్లనేనా ఆ సందేహాలు నివర్తించివుంటాయనుకోవాలి) యిదంతా నీస్వకపోలకల్పితంగాన ఆలా జరగలేదంటారా? అయితే - “విబుధజనులవలన విన్నంత కన్నంత" అని పోతరాజుగారు కృత్యాదిని వ్రాసిన మాటకు తాత్పర్యం యేమిటో చెప్పండి;

యింతకూ ఫలితార్థం యేమిటంటే? కవికిన్నీ యితరులకున్నూ విద్యాసంపాదనలో చాలా తేడా వుంటుంది. కవి "చూపితే పుచ్చుకుపోతాడు" యితరవిద్యార్థులో, గురువుగారు