పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

373


కాదు. కొందఱు వేదాంతపండితులని అడిగాం; తేలలేదు. తుదకు "గోఁడమీఁది పిల్లి వాటం”గా ఆంద్రీకరించాము. ఆ ప్రకారమే షష్టిపూర్తిముద్రణంకూడా జరిగింది. అప్పుడు నేను మఱీ దుస్థితిలో వున్నాను. అందుచేత యీ విచారమే కాదు; యేవిచారమూకూడా అచ్చుకి సంబంధించింది నాకు పట్టనేలేదు. పిమ్మట యేదో కొంచెం ఆరోగ్యం కలిగాక యేదో గ్రంథం చూస్తూవుంటే యీశ్లోకం కొంత టిప్పణిసహితంగా కనపడింది. కాని దానివల్ల కూడా సంప్రదాయార్థం గోచరించిందేకాదు. తుదకి వకపిల్ల వాఁడు - వేదాంతశిరోమణికి చదువుకుంటూ వున్నవాఁడు - నా దగ్గరికి వస్తే అతణ్ణి అన్వయించమన్నాను. చక్కఁగా అన్వయించాఁడు. యేముంది? “వడ్లగింజలోది బియ్యపుగింజ”గా తేలింది. ఆకాశాన్ని చర్మంలాగ యెప్పుడయితే మనుష్యులు చుట్ట చుట్టఁగలరో అప్పుడు శివుణ్ణి తెలుసుకోకుండా దుఃఖం యొక్క అనఁగా సంసారం యొక్క నాశం కలుగుతుంది. అనఁగా, ఆకాశం చుట్టచుట్టడమూ అసంభవమే; శివజ్ఞానం వినాగా దుఃఖం తొలఁగడమూ అసంభవమే అని తాత్పర్యం. “మరువదుశీనరేషు జలం” అన్నరీతిని అన్వయించుకోవలసి వుంది. దీనిలో నిజానికి అంతగా గూఢమైన విషయమున్నూ లేదు, స్వయంకృషిచేత ఆర్జించిన పాండిత్యాలవారికి యీలాటివి అక్కడక్కడ అడ్డు తగులుతాయి. అందుచేత “గురుశుశ్రూషయావిద్యా” అన్నారు. అందుచేతే “గురువులేని విద్య గ్రుడ్డివిద్య” అనుకోవలసి వచ్చింది. అట్లని సర్వమూ గురువు చెప్పడమూ, శిష్యుఁడు వినడమూ తటస్థిస్తుందా! అదల్లా వక్క వేదానికి మాత్రమే. తక్కిన విద్యలకో? యేకొంచెమో గురువు మార్గం చూపుతాఁడు; తక్కినదంతా శిష్యుని స్వప్రయోజకత్వానికి సంబంధించిందే. “శతశ్లోకేన పండితః” అని యెందుకన్నారు? కాళిదాసుగారి పూర్వోత్తర మేఘాలు రెండూ కల్పితే నూఱుశ్లోకాలకు కొంచెం సుమారు వుంటాయి. దాని వ్యాఖ్యానంలో యెన్నో సంప్రదాయాలు వున్నాయి. ఆశ్లోకాలనాఁటికి వ్యాఖ్యానం చెపుతూనే పాఠంచెపుతారు గురువులు. అవి నూఱూ వ్యాఖ్యానంతో వల్లిస్తే వాఁడు పండితుఁ డవుతాఁడంటే, పరశ్లోకాన్వయజ్ఞానం చాలావఱకు కలుగుతుందన్నమాట.

పోతరాజుగారు యీ మాత్రమూ చదవనివారు కారు. కాని చదివి కూడా “సహజపాండిత్య” బిరుదాన్ని యెందుకు వేసుకున్నారనేది విచార్యం కాకపోదు. యింతమాత్రం చదివితే శ్రీమద్భాగవతం అనువదించడానికి కొఱకఁబడదు. నాకు తోఁచినమాటలు వ్రాస్తాను. రుచిస్తే అంగీకరించండి; లేదా, త్యజించండి. ఆయన పూర్వజన్మసంస్కారం మంచిది. కనుక యింతమాత్రం చదివేటప్పటికే శ్రీమద్భాగవతం పఠిద్దామనే వూహ కలిగివుంటుంది. ఆపట్లాన్ని ఆ గ్రంథం సంపాదించడం అవసరమయి వుంటుంది.