పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/358

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

362

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కృష్ణదేవరాయలు పెద్దన్నగారి మరణానంతరం జీవించివుంటేనేకాని ఆయీవిషయం - సమన్వయించదు. కృష్ణదేవరాయల మరణానంతరం పెద్దన్నగారు-చెప్పిన "ఎదురైనచోఁ దన మదకరీంద్ర" పద్యం అందఱూ-యెఱిఁగిందేకనక విస్తరించను. "పక్కిటిపురాణ" వ్యాసంలో యీలాటి విషయాలెన్నో చర్చించివున్నాను. ఆ కవుల జీవితానంతరం వారినిగూర్చి పుక్కిటిపురాణాలెన్నో బయలుదేరాయి. కాని మమ్మల్ని గురించి మా యిద్దఱి జీవితకాలంలోనే యెన్నో పుక్కిటిపురాణకథలు బయలుదేఱాయని మే మిద్దఱమున్నూ యెఱుంగుదుము. ఇటీవల అతని జీవితానంతరం మఱికొన్ని బయలుదేరడం యింతకుపూర్వమే నేను యెఱుఁగుదును.

ఆయీరకం కొంటెపద్యాలు తి. శాస్త్రిగారివి కొన్ని వున్నాయనే ఘట్టంలో మన మిప్పుడు వున్నామనేది ప్రస్తుతం. ఆ పద్యాలల్లో వక్కటీ వుదాహరించకపోవడం యిప్పటి నాగరికులకు బొత్తిగా రుచించవనేకాని మఱొకటికాదు. ఆ పద్యాలల్లో కొన్ని శ్రీనాథుఁడు పల్నాటిసీమలో చెప్పిన వాట్లని పోలివుంటాయి. యీలా వూరించివూరించి వకటీ వుదాహరించకపోతే కొందఱు చదువరులు బొత్తిగా హతాశులవుతారు కనక, చాలా మృదుపాకంలో వున్నదాన్ని వకదాన్ని వుదాహరిస్తాను.

ఉ. “నన్నొకనాతి 'రేపటిదినమ్మునఁ బోయెదుగాక' యంచుఁ గ్రా
     ల్గన్నుల నీరు జాఱ వికలమ్ముగ గద్దదకంఠి యయ్యెన
     య్యన్నులమిన్నతోడ 'వల' దంచుఁ బెనంగిన మానదయ్యె నన్
     మన్ననఁ జూడు రేపటి దినమ్మునఁ బోవుదమయ్య మిత్రుఁడా"”

ఆ యీ రచనవల్ల తి. శాస్త్రిగారి శృంగార రచన యేలాటిదో రసజ్ఞులు తెలుసుకుంటారు. ఇందులో “మిత్రుఁడా" అనే సంబోధన నన్ను ఉద్దేశించినదని వ్రాయనక్కరలేదు. అతనికి నావలెనే విడివిడి పదాలతో రచన సాగించడమే యిష్టంకాని, యేవో సమాసాలతో పద్యాన్ని పూరించడం యిష్టంకాదు. అయితే రసానుగుణంగా సమాసభూయిష్ఠమైన రచన కావలసివస్తే "సంస్కృతం బుపచరించిన పట్టున భారతీవధూటీ తపనీయ" అని పెద్దన్నగారు అందుకున్నట్టు అందుకుంటాఁడు. అట్టిది, అతనిది అవునా కాదా అనేశంకకు అవకాశం లేనిది వకటి వుదాహరిస్తాను.

శా. “మాకన్నన్ మహనీయులైన కవులీ క్ష్మామండలిన్ లేకపో
     రీకాలమ్మున యుష్మదీయకవితా ద్వీపమ్ము ముంచంగ న
     స్తోకశ్రీక మదాశుధారకవితా తుంగార్భటీ ఘోరగం
     గాకల్లోలవతీ ప్రవాహభరవేగ ప్రక్రియల్ చాలవే?"