పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

361


పద్యాలువినిపించే దాఁకా ఆతని ఆవేశం ఆఁగిందేకాదు. "యేదో మావాఁడు తొందర మనిషి ఆయీపద్యాలు చెప్పాఁడు. చెప్పినవి మీకువినిపించకపోతే ప్రకటనానికి అర్హం కాపని వినిపించవలసి వచ్చిం"దంటూ సబోరీగా జమీంద్దారు గారికి నచ్చఁజెప్పాను.

యింతటితో యిది ముగిసినట్టే. కాని ఆ యేలూరులో తత్కాల మందు శ్రీ వేమూరి శ్రీరామశాస్త్రి శతావధానిగారు నివాసంగా వున్నారు. ఆయన శ్రీ వ. సు. రాయకవిగారినీ, శ్రీ కొప్పరపుసోదరకవులనూ, మమ్మల్నీ శిష్యుఁడు శివరామశాస్త్రినీ విందుకు పిల్చారు. ఆ విందుకు వెళ్లడం అతనికి సుతారామున్నూ యిష్టంలేదు. తుదకు యేలాగో రావడం వచ్చాఁడు. మొత్తం యేలాగయితేయేమి, శివరామశాస్త్రిని విడఁదీశాఁడు. “మా యిద్దఱికీ యీపూఁట భోజనం అవసరంలేదు. అజీర్తిగావుం"దన్నాఁడు. కాదుకూడదని బలవంతంచేస్తే మఱింతచెడి రసాభాసులోకి దిగుతుందని నాకు పూర్తిగా తెలిసేవుండడంవల్ల అసలు కుల్లస్సు యెఱిఁగిన నేనుకూడా "వాళ్లని బలవంతపెట్టకండి 'అజీర్ణే భోజనంవిష' మన్నారుకదా?" అని వాళ్లమాటలనే బలపఱిచాను. వారిద్దఱూ వినాగా భోజనం జరుగుతూవుంది. అప్పుడువచ్చి "అబ్బా! మా మిక్కటంగా ఆఁకలవుతూఉంది. త్వరగా వద్దనకావా"లంటూ ప్రారంభించాఁడు. యీలాటి ప్రయోజనం మాలిన కొంటెతనాలు ఆమరణమూ ఆతన్ని వదలనే లేదు.

శృంగారంలో అంతగా రచించిన రచన అతనిది లేదుగాని కొంటెతనపు పద్యాలుమాత్రం కొన్నివున్నాయి. అవి రికార్డులో యిప్పటికీ జాగ్రత్తపెట్టఁబడే వున్నాయి గావి వుదాహరిస్తే యీకాలపు నాగరీకం అంతగా ఆమోదించదేమో! -

“ఒంటిమిట్టను గాఁపురం బున్నయట్టి ! సిద్ధిసానికి సంకల్పసిద్ధిరస్తు,
 చెలఁగిమాఁమీఁదఁ బద్యమ్ముచెప్పినట్టి | పాపరాజుకు నిధువనప్రాప్తిరస్తు."

అనే కంకంటివారి పద్యం మాదిరిలో కొన్ని వుంటాయి. కొన్ని యింకా ముదరపాకంలో వుంటాయి. వాట్లకుపోలిక -

చ. "వదలక మ్రోయునాంధ్రకవి వామపదమ్మున నున్న నూపురం
      బుదితమరాళకంఠ నినదోక్తుల నేమని పల్కెఁ బల్కుఁడీ
      గుదియలసాని ... ... ... ... ... ... గల భాగ్యరేఖ నీ
      నుదుటను లే దటం చమర నూత్నపురంధ్రులతోడఁ బల్కెడిన్."

అనేపాకంలో వుంటాయి. యీ పద్యం అల్లసాని పెద్దన్నగారిని గూర్చి శ్రీకృష్ణదేవరాయలు పెద్దన్నగారి మరణానంతరం ప్రశ్నించినప్పుడు రామలింగం వేళాకోళంగా పెద్దన్నగారి శృంగారానుభవస్ఫోరకంగా చెప్పినట్టు చెప్పుతారుగాని ..