పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

349


వోపికలేదు, యేదో చూడమన్నాఁడాయన, చూస్తానన్నాను- చూచేదేమిటి, ఆయనకూడా పండితుఁడేకదా అనుకున్నాను. సరస్వతీప్రస్సులోనే కాఁబోలును అచ్చుపడింది. ప్రూఫులు ప్రూఫురీడరు దిద్దినట్టున్నాఁడు” అంటూ జవాబు చెప్పాఁడు. అతఁడు యితరుల గ్రంథాలవిషయంలోనే కాదు, మాసొంతాల విషయంలో కూడా యింతే; శ్రద్ధచూపేవాఁడు కాఁడు. కొత్తపల్లి సూర్యారావుగారు యింకా జీవించే వున్నారు. వారిని అడిగితే యింకా యీ విషయం సవిస్తరంగా తేలుతుంది. సరస్వతీ పత్రికకు మేటరివ్వడానికి ఆయన్ని పెట్టే తిప్పలు వగయిరాలు ఆయనే చెప్పాలి. వున్న పాండిత్యాన్ని శ్రద్ధపట్టి వినియోగించడంలో అతనికి వున్న పాలుమాలిక వాచామగోచరం. ఆపాలుమాలికవల్ల కలిగిన “జితకాశి"కే నేడు "చెళ్లపిళ్ల వెంకటయ్య"కు "దేవాదేవేషు" అంటూ నెల్లూరిపత్రికలలో వివాదాలు పడడమూ, వానికి నేను నోరు మూసుకు వూరుకోవడమూ యెవరో వెలమకన్ని శతావధానిగారు కల్పించుకొని కొంత వ్రాయడమూ ఆమధ్యతటస్థించింది. "జితకాశి" శబ్దానికి అర్థం శబ్దరత్నాకరంలో సమేతూవుంది. కాని దాన్ని కూడా చూచేపాటిశ్రద్ధ అతనికి వుండేదికాదు. ఆబుద్ధి చాకచక్యానికి శ్రద్ధ అనేదే వకటి వుంటే యీలోకమేకాదు, పద్ధాలుగు లోకాల్లో వుండే బుద్ధిమదగ్రేసరులు యేకీభవించినా అతనిముందు నిల్చేవారేకారన్నది అతిశయోక్తికాదు. యెప్పుడో సమయం వచ్చే దాకా అతఁడు తనబుద్ధికి పనిచెప్పేవాఁడే కాఁడు. అందుచేతే యేకొంచెమో వయస్సు ముదిరినపిమ్మట బుద్ధితీక్ష్ణత తగ్గినా యావజ్జీవమున్నూ అంతో యింతో అవధానం చెయ్యడానికి వెనుదీసేవాఁడు కాఁడు. నాకో, సర్వదా బుద్ధికి పని చెపుతూ వుండడంవల్ల బందరు ప్రవేశించే ప్రాంతంలో బుద్ధితీక్ష్ణత చాలా తగ్గింది. యీవిషయం యిటీవల గుంటూరిసీమ అవధానాలు చూచిన వాడికి విశదమే. వెనకటిసంగతులు వ్రాయవలసి వస్తేకాని, చెప్పవలసి వస్తేకాని యీ 68 యేళ్ల వయస్సులో కూడా పూసగుచ్చినట్టు అట్టపుట్టాణాళ్లతో నాకు మూఁడేళ్లవయస్సులో జరిగిన కథలదగ్గిరనుంచి వ్రాయడానికి జ్ఞాపకశక్తి వుంది. కాని ఆశక్తి యాదృచ్ఛికంగా వినియోగించడానికేగాని యేదేనా నిర్బంధంగా పనిపెట్టుకుంటే మాత్రం పనిచేసేస్థితిలో లేకపోవడం ఆరంభమై అప్పుడే యిరవైయేళ్లు కావచ్చింది. యేదేనా తన్మయత్వం తటస్థిస్తేమాత్రం యిప్పుడుకూడా అన్నాహారాలు తోచకుండా కవితాధార నడుస్తుందన్నందుకు నిన్న మొన్న రచించిన ‘జయంతిన్నీ" "క్షమాపణమున్నూ" లోకానికిసాక్ష్యమీయడానికి సందేహంలేదు. యిదే నాప్రకృతిలో వున్న విశేషం. ఇట్టి పట్టుదలగాని, తన్మయత్వంగాని ఆతని ప్రకృతిలో లేదు. వొక్కప్పుడు తాత్కాలికంగా ఈ గుణాలుకల్గినా అవి తుట్టతుద వరకున్నూ నిల్వక అంతంతలోనే అంతరించేవి. ఆ కారణంచేతే కొన్ని గ్రంథాలు మొదలుపెట్టి చక్కనిశైలిలో కొంత వ్రాసినపిమ్మట ఆఁగిపోవడం తటస్థించేది.