పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/342

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

346

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

కవిత్వం సంగతి కొంత తెల్పినట్టయింది. యిఁక పాండిత్యం. దీన్ని గుఱించి అతని జీవితచరిత్రలో తెల్పేవున్నాను. అయినా ప్రసక్తి కల్గింది గనక మళ్లా వ్రాస్తాను. నేనున్నూ, తిరుపతిశాస్త్రిన్నీ కలుసుకునే టప్పటికి తిరుపతిశాస్త్రికి నాకంటే సంస్కృతసాహిత్యం హెచ్చు. అప్పటి కప్పుడే కొన్ని నాటకాలూ, చంపులూ కూడా అతఁడు గురుముఖతః చదివి బ్రహ్మయ్యశాస్త్రులవారి వద్దకు వ్యాకరణాధ్యయనానికి వచ్చాఁడు. నేనో? గురుముఖతః భారవివఱకే చదివి వచ్చానన్నమాట. యీ సందర్భాన్నిబట్టి మేమిద్దఱమూ కలుసుకొనే టప్పటికి, నాకంటే అతనికి సంస్కృతసాహిత్యం హెచ్చని వేఱే చెప్పనక్కఱలేదు. నేను ఆ స్థితిలోనే యావజ్జీవమూ నా సంస్కృతసాహిత్యాన్ని వుంచుకొనేయెడల యిప్పటి విమర్శకుల యుక్తులు సరిపోతాయి. ఆలా వుంచుకోలేదుగదా! అయితే ఆ పిమ్మట యే గురువుగారిదగ్గర సాహిత్యగ్రంథాలు అభ్యసించావు అంటే వినండి. ఆకాలంలో మా గురువుగారి దగ్గిరికి చాలామంది విద్యార్థులు వస్తూవుండేవారు. వ్యాకరణపాఠం తప్ప కావ్యపాఠాలు చెప్పడం నామీఁదా, తి. శా. మీదా వుండేది. చదువుకొన్నమీఁదట సమన్వయించి చెప్పే పాఠం తిరుపతిశాస్త్రిది. నాదో? కేవలం బుద్ధిని వినియోగించి చెప్పేది. ఆ కారణంచేత నేను చదవని మాఘకావ్యం వగయిరాలు పాఠంచెప్పేటప్పుడు యెక్కడేనా అసంప్రదాయపుతోవ యే కొంచెమో దొర్లేది. ఆలాటి సందర్భంలో అతని శిష్యులు నా శిష్యుణ్ణి ఆక్షేపించడం జరిగేది. అది వెంటనే అంటుకునేది; మా యిద్దరికీ వాదం పడేది; గురువుగారిదాఁకా వెళ్లేది. సంప్రదాయసిద్ధమైనదేదో వారు చెప్పేవారు కాని, మళ్లా యీవలికి వచ్చాక మాపిడివాదం మేము చేస్తూనే వుండేవాళ్లం. కాని యథార్ధం ఆ గందరగోళంలో గోచరించడం జరిగేది. అప్పటిమట్టుకు “నాదేన్యాయం నాదేన్యాయం" అని బుకాయించినా యిటీవల సంప్రదాయ సిద్ధమైనదేదో తెలిసిపోయేది. యీలాటి వాదోపవాదాలు నాకూ తిరుపతిశాస్త్రికీ మాత్రమే కాదు. యింకా మఱికొందఱు విద్యార్థులతో కూడా వచ్చేవి. ప్రత్యేకించి పనికట్టుకొని కొన్ని వూళ్లు దీనికోసం వెళ్లడంకూడా జరిగేది. ఆ విద్యార్థులకి వ్యాకరణంలో చింతనచెప్పడం మా యిద్దఱిలో యెవరో చెప్పవలసివచ్చేది. ఓపికపట్టి చెప్పడానికి అప్పుడే కాదు, యిప్పటికీకూడా నన్నుచెప్పి యితరులను చెప్పవలసి వుంటుంది. అందుచే నాపార్టీ యెక్కువగా వుండేది. అక్కడక్కడ మళ్లాయీచింతన చెప్పుకొనే విద్యార్థులు మమ్మల్ని యిద్దఱినీ వెక్కిరిస్తూ వుండేవారు కూడాను. కొట్టుకోవడం పర్యంతమూ జరుగుతూ వుండేది. వొక గాథ వుదాహరిస్తాను. మేమిద్దఱమూ కలిసి కవిత్వం చెప్పడం మొదలు పెట్టాక ధాతురత్నాకరపీఠికలో వక శ్లోకం.

శ్లో. 'పశుపతిదయితాతృతీయపుత్రౌ ! తిరుపతివేంకటశాస్త్రిణౌ కవీంద్రౌ'